టీడీపీ కూటమి ఓటర్లను ఏరుతున్న వైసీపీ!

ప్రతి యాభై ఇళ్లకు ఒకరు అన్నట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ తో జగన్మోహన్ రెడ్డి నియమించిన వాలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలకు చాలా చక్కగా వాడుతోంది. ప్రాథమికంగా ఈ దశలో వాలంటీర్ల ద్వారా సర్వేలాంటి పనిని వారు చేయిస్తున్నారు. తద్వారా.. అసలు తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమికి ఓటు వేసే వాళ్లు ఎవరు? ఎందరున్నారు? లెక్కలు తీస్తున్నారు. అంత స్పష్టంగా బయటపడకుండా.. అటుఇటుగా ఉండే ఓటర్లను కూడా లెక్కలు తీస్తున్నారు. ముందుగా ఓటర్లను ఇలా వర్గీకరించి.. వారి మీద ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు.


ఇన్నాళ్లుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వాలంటీర్ల మీద ఒకే రకమైన ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఇంటింటికీ తిరగండి. జగన్ మళ్లీ గెలవకపోతే.. ఇప్పుడొస్తున్న పథకాలేవీ రావు అని చెప్పండి. కనీసం వృద్ధులకు పెన్షన్లు కూడా రావు అని చెప్పండి. చంద్రబాబు గెలిస్తే గనుక.. వాలంటీర్లుగా మీ ఉద్యోగాలు కూడా పోతాయి.

కనీసం మీ ఉద్యోగాలను కాపాడుకోవడానికి అయినా.. మీరు ఖచ్చితంగా జగన్ ను గెలిపించడానికి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయండి అని చెబుతూ వచ్చారు. ఇప్పటికి కూడా వారి మీద ఆ బాధ్యత ఉండనే ఉంది.

తాజాగా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సమయంలో వారి మీద మరో బాధ్యత కూడా మోపారు. అదేంటంటే.. తమ తమ పరిధిలో తెలుగుదేశానికి, జనసేనకు, బిజెపికి ఓట్లు వేసే వారు ఎవ్వరెవ్వరో పేర్లతో సహా వైసీపీ నాయకులకు చేరవేయాలి. సాధారణంగానే సమాజంలో చాలా వరకు ఓటర్లు స్పష్టంగా విడిపోయి ఉంటారు.

వైసీపీ, టీడీపీ-జనసేన-బిజెపి ఓటర్లు బయటపడిపోతుంటారు. గుంభనంగా ఉండేవాళ్లు, పరిస్థితుల్ని బట్టి, అభ్యర్థుల్ని బట్టి ఓటు వేసే వర్గం కూడా ఒకటి ఉంటుంది. ఈ మూడువర్గాల వారిని పేర్లతో సహా జాబితా కట్టడానికి వైసీపీ వాలంటీర్లను వాడుకుంటోంది.

ప్రతిపక్షానికి అనుకూలురైన ఓటర్లు ఎవరో.. ఎందరున్నారో స్పష్టంగా తెలిస్తే వారిని వీలైతే లోబరుచుకోవడానికి లేదా బెదిరించడానికి, ప్రలోభపెట్టడానికి ఏమీ కుదరకపోతే పోలింగ్ నాడు వారు అసలు బూత్ లకే రాకుండా ఆటంకాలు సృష్టించడానికి రకరకాల వ్యూహాలతో వారు సిద్ధం అవుతున్నారు. వాలంటీర్లను తాయిలాలతో మభ్యపెట్టి ఇలాంటి అనైతిక పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories