ఏపీలో పరిణామాలతో పోలీసు బాస్ కే ప్రమాదమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ బాగా వేడెక్కుతున్నాయి. ఎన్నికల్లో ప్రధానంగా తలపడుతున్న వైసీపీ- ఎన్డీయే కూటమి మధ్య కీచులాటలు తగాదాలు ముదురుతున్నాయి. దాడులు కొట్లాటలు పెరుగుతున్నాయి. పార్టీ నాయకుల మీద, ఏకంగా అభ్యర్థుల మీద, ప్రత్యర్థి పార్టీ నాయకుల ఆస్తుల మీద దాడి చేయడం అనేది రివాజుగా మారిపోయింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.. ఎక్కడబడితే అక్కడ.. విపక్ష నాయకులపై రెచ్చిపోతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే తాజా చర్చ ఏంటంటే.. వీటన్నింటి పర్యవసానంగా.. నెగటివ్ ప్రభావం.. రాష్ట్ర పోలీసు బాస్ రాజేంద్రనాధ్ రెడ్డిపై పడుతుందా అనే చర్చ జరుగుతోంది.


సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. వెంటనే కీలక స్థానాల్లో ఉండే అధికారుల్ని మార్చేస్తారు. తమకు అనుకూలురైన వ్యక్తుల్ని తెచ్చి డీజీపీ, చీఫ్ సెక్రటరీ లాంటి స్థానాల్లో పెట్టుకుంటారు. ఆ స్థానాల్లోని వ్యక్తులు.. ఆ ప్రభుత్వానికి అడ్డదారుల్లో కూడా సహకరిస్తూ ఉంటారనే ఆరోపణ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై అలాంటి ఆరోపణలు మిన్నంటుతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశానికి చెందిన ఇద్దరి హత్యలు జరిగాయి. ప్రతిరోజూ పలుచోట్ల చెదురుమదురు దాడులు, ఘర్షణలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ దాడులపై, జరుగుతున్న సమయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా మిన్నంటుతున్నాయి. ఇప్పటికే కొందరు, ఎస్పీలు తదితర అధికార్ల మీద వేటు పడవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

తాజాగా తెలుగుదేశానికి చెందిన సీనియర్ నాయకులు వర్లరామయ్య, బోండా ఉమామహేశ్వరరావు లు ఏకంగా డీజీపీ రాజేంద్రనాధరెడ్డి, విజిలెన్స్ ఐజీ రఘురామ్ రెడ్డి ఇంకా కొందరు ఐపీఎస్ అధికారుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


వీరందరూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు రాష్ట్రవ్యాప్తంగా తమమీద వేర్వేరు పోలీసుస్టేషన్లలో నమోదై ఉన్న కేసుల వివరాలు అందించాలని కోరుతున్నా, ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆ వివరాలు పేర్కొనడం అవసరం అయినా.. సహకరించడం లేదని డీజీపీ గురించి ఫిర్యాదుచేశారు. మరి కొన్ని రోజుల పాటు తెలుగుదేశం, జనసేన వారి మీద దాడులు ఇలాగే కొనసాగినట్లయితే.. ఈసీ తీవ్రంగా పరిగణిస్తుందనే అభిప్రాయం పలువురిలో ఉంది. డీజీపీని మార్చడానికి కూడా ఈసీ వెనుకాడకపోవచ్చునని, గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సీజను మొదలు కాగానే.. ఏకపక్షంగా ఉండే డీజీపీలను మార్చేసిన చరిత్ర ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories