చంద్రబాబునాయుడు సొంతదైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు రాజకీయ వాతావరణం ఆ పార్టీకి చాలా సానుకూలంగా కనిపిస్తోంది. కుప్పంలో చంద్రబాబు గెలుపు ఎటూ ఖరారే. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశానికి కుప్పం తప్ప ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు.. కనీసం అయిదారు నియోజకవర్గాల్లో కేక్ వాక్ లాగా పార్టీ గెలవబోతున్నదని అంచనాలు సాగుతున్నాయి. కుప్పంను పక్కన పెట్టినా.. పలమనేరులో సిటింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన వెంకటేష్ గౌడ మీద తీవ్రమైన అసమ్మతి ఉంది. అయినా ఆయనకే టికెట్ దక్కింది.
దీంతో తెదేపా అభ్యర్థి ఎన్ అమరనాధ్ రెడ్డి గెలుపు ఈజీ అయిపోయింది. మదనపల్లెలో తెదేపా షాజహాన్ ఢంకా బజాయించి గెలుస్తారని నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా ఒకటే మాటగా చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాను సొంత పార్టీ వారే పనిగట్టుకుని ఓడిస్తారనేది అందరికీ తెలిసిన సంగతే. తంబళ్లపల్లెలో కూడా అవకాశం ఉన్నదని అంటున్నారు. మిగిలిన నియోజకవర్గాలు ఇదమిత్థంగా తేల్చిచెప్పలేని పరిస్థితి.
ఇవన్నీ ఇలా ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది.
ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్నారు. వైసీపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ధనవనరుల పరంగా చింతల భారీగానే ఖర్చు పెడతారనే అంచనా ఉంది. అయితే.. నల్లారి కిరణ్ కు తన సొంత నియోజకవర్గంలో చాలా మంచి పేరు ఉంది. ఆయన తన తమ్ముడి విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా అనేదే ఇప్పుడు సందేహంగా ఉంది.
అన్నదమ్ములు ఇద్దరికీ కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కిరణ్ కు తన స్వగ్రామంలో సొంత ఇల్లు కూడా లేకుండా తమ్ముడు చేసేశారనే ప్రచారం ఉంది. ఆ విభేదాల వలన.. ఆయన తమ్ముడికోసం పనిచేస్తారనే నమ్మకం లేదు. కాకపోతే, ఇప్పుడు తెలుగుదేశంతో బిజెపి పొత్తు పెట్టుకుని ఉన్నది గనుక.. పొత్తు ధర్మం పాటిస్తూ..
కిరణ్ కుమార్ రెడ్డి పీలేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకుంటే.. మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తే.. కిషోర్ ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. మరి తమ్ముడు అన్నయ్యను ఒప్పించగలరా? లేదా? అనేదానిని బట్టి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశానికి ఒక సీటు అదనంగా దక్కే అవకాశం ఉంటుంది.