బోడె పంతం నెగ్గింది! త్యాగమూర్తి ఉమా!

తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి అభ్యర్థుల మూడో జాబితాను చంద్రబాబునాయుడు విడుదల చేశారు. ఈ మూడో జాబితాలో 11 ఎమ్మెల్యే స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ఆయన నిర్ణయించారు. ఇంకా కేవలం  5 ఎమ్మెల్యే, 4 ఎంపీసీట్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి. అనేక సమీకరణాలను పరిశీలించిన తర్వాత.. నియోజకవర్గాల్లో ప్రజలనుంచి పలువిడతలుగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత.. అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా చంద్రబాబునాయుడు చెప్పారు.


ఈ మూడో జాబితాలో తెలుగుదేశం పార్టీకి కొన్ని శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. పలాస నుంచి గౌతు శిరీషకు తొలి రెండు జాబితాల్లో చోటు దక్కలేదు. పార్టీలో గట్టిగా గళం వినిపించగల నాయకురాలు అయిన శిరీష్ అసంతృప్తికి గురయ్యారు కూడా. ఆమెకు ఈ విడతలో ప్రకటించారు. సర్వేపల్లి విషయంలో మాత్రం పార్టీకి ఇప్పటికీ అనుమానంగానే ఉంది. అక్కడ ఎంపిక చేసిన కేండిడేట్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవలేదు. వరుసగా ఓడిపోతూనే ఉన్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదని చంద్రబాబు భావించారు. ఆయన బదులుగా ఆయన కోడలును పోటీకి దించాలని అనుకున్నారు. అయితే.. వైసీపీని నియోజకవర్గంలో ఢీకొట్టడానికి సీనియారిటీ, అనుభవం అవసరం అనే ఉద్దేశంతో సోమిరెడ్డి పేరునే చివరికి ఖరారు చేశారు.

పార్టీలో సీనియర్ల, చిత్తశుద్ధి గల నాయకుల మధ్య పీటముడికి కారణమైన మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలకు కూడా మూడో జాబితా క్లారిటీ ఇచ్చింది. మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యర్థి వైసీపీ తరఫున గెలిచిన వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి రావడంతో అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వడం తెలుగుదేశానికి అనివార్యమైంది. నిజానికి ఇది దేవినేని ఉమాకు షాక్ అని చెప్పాలి. ఆయనకు పెనమలూరు ఇస్తామని ప్రామిస్ చేశారు. అక్కడి ఇన్చార్జి బోడె ప్రసాద్ కు ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. పార్టీకి, చంద్రబాబుకు విధేయుడిగా ఉంటూనే స్వతంత్రంగా పోటీచేస్తానని, గెలిచి ఆ సీటును బాబుకు కానుకగా ఇస్తానని ఢంకా బజాయించి చెప్పారు. ఆయన ఆ పనిచేస్తే పార్టీకే నష్టం అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అయింది.

చివరికి బోడె ప్రసాద్ పంతం నెగ్గింది. చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మైలవరం ను వసంతకు త్యాగం చేసినందుకు తనకు పెనమలూరు దక్కుతుందని ఆశపడిన దేవినేని ఉమా చివరకు త్యాగమూర్తిగానే మిగలాల్సి వచ్చింది. అయితే ఆయనను పార్టీ పనులకోసం కీలకంగా, మెరుగ్గా వాడుకోనున్నట్టు సమాచారం. ఉమామహేశ్వరరావు ఎక్కడా కూడా తనలోని అసంతృప్తిని బయటపెట్టకపోవడమే.. మూడోజాబితాకు సంబంధించి శుభపరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories