బస్సు యాత్ర రూట్ కు హడావుడి రిపేర్లు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈనెల 27వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రమంతా కూడా రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో బస్సు యాత్ర ఎలా సాధ్యం? అనే సందేహాలు అనేకం వ్యక్తం అవుతున్నాయి. ఏపీ మొత్తం కలిపి చూసినా టోల్ ఫీజులు భారీగా వసూలు చేసే నేషనల్ హైవేలు తప్ప.. రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని రోడ్లు ఏవీ కూడా పట్టుమని పది కిలోమీటర్లు కూడా సవ్యంగా శుభ్రంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైన తర్వాత.. ఆ రోడ్లకు హడావుడిగా రిపేర్లు చేయిస్తున్నట్టు వినిపిస్తోంది.

ఏపీలో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయనే సంగతి కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడో గొడవ అయినప్పుడు మొక్కుబడిగా కొన్ని రిపేర్లు చేయడం తప్ప.. ఈ మరమ్మతుల గురించి పట్టించుకోలేదు. గ్రామీణ రోడ్లలో తిరిగే వాహనాలు విరిగిపోతున్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కేవలం రోడ్లలో గోతుల వల్ల.. ప్రమాదానికి గురై ప్రజలు మరణించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ తమ సొంత నిధులతో కొన్ని చోట్ల రోడ్లు వేయించడానికి పూనుకున్నారు. వాళ్లు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ఆ ముందురోజు రాత్రి కొన్నిచోట్ల హడావుడిగా రిపేర్లు చేసి కాస్త డ్రామా నడిపించారు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర చేస్తానని అంటుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోతులమయమైన రోడ్లు ఉన్నాయనే సంగతి అసలు జగన్ కు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. జగన్ ప్రయాణించే రూట్ మ్యాప్ హైబ్రిడ్ విధానంలో ఉంటుందిట. అంటే కొంతదూరం హెలికాప్టర్ లో ప్రయాణించి, కొంత దూరం, కొన్ని ప్రాంతాలు మాత్రం ఆయన బస్సులో యాత్ర చేస్తారన్నమాట. పేరుకు మాత్రం దానిని బస్సు యాత్ర అనే పిలుస్తారు. అయితే హెలిపాడ్ నుంచి బస్సు యాత్ర సాగినంత మేర దూరాల్లో ఉండే రోడ్లకు హడావుడిగా మరమ్మతులు చేయిస్తున్నారట. జగన్ ప్రయాణించేప్పుడు ఆయన గోతుల ఎఫెక్ట్ తెలియకుండా స్మూత్ గా జరిగిపోయేలా చూస్తున్నారట. ప్రజలు మాత్రం ఈ రిపేర్లపై మండిపడుతున్నారు.  ఇన్నాళ్లో గోతుల్లో అవస్థలు పడుతూ ప్రయాణాలు చేసిన తాము మనుషులం కాదా అని నిలదీస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories