ఏపీలో అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరిగే తేదీ మే 13 నాటికి నిర్ణయం కావడం జగన్ కోటరీకి ఒక శరాఘాతం. అప్పటిదాకా బటన్లు నొక్కే అవకాశం పోయింది. అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పాల్సిందే తప్ప.. ఇదిగో చేస్తున్నా.. డబ్బు మీ ఖాతాలోకి పంపుతున్నా.. మీరు నాకు ఓట్లు వేయండి అని మభ్యపెట్టడానికి వీల్లేకుండా పోతోంది. కొత్తగా జనానికి బిస్కట్లు పంచిపెట్టి వారిని లోబరచుకోవడానికి అవకాశాలు అన్నీ మూసుకుపోయాయి. అలాంటిది రాష్ట్ర ప్రజలపై జగన్ వేసిన చిట్టచివరి బిస్కట్ కూడా ఇప్పుడు డోలాయమానంలో పడుతోంది. ఆ ప్రలోభం అమల్లోకి వస్తుందో రాదో చర్చనీయాంశంగా ఉంది.
తాను అధికారంలోకి వస్తే వారంలోనే ఉద్యగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తాను అనే ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు పూర్వం ఓటర్లను మభ్యపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటినుంచి అయిదేళ్లపాటు ఒక్క ఉద్యోగాన్నయినా భర్తీచేసిన పాపాన పోలేదు. అస్సలు పట్టించుకోలేదు. నిరుద్యోగులు ఆందోళనలు చేసినా కూడా తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. సంక్షేమం పేరుతో డబ్బులు పంచి పెట్టడం తప్ప, యువతకు ఉద్యోగావకాశాల పరంగా మోసం చేశారనే మాట ప్రజల్లో బాగా వ్యాపించింది.
ఇలాంటి నేపథ్యంలో వీలైనంత వరకు నష్టనివారణ చేయడానికి ముఖ్యమంత్రి కొన్ని ఎత్తులు వేశారు. అందులో భాగంగానే టీచరు పోస్టులు భర్తీ చేయడానికి డీఎస్సీ ప్రకటించారు. షెడ్యూలు ప్రకటించడానికి ముందురోజున ఉద్యోగులకు డిఏలు ఇస్తున్నట్టుగా చేసిన ప్రకటనగానే.. ఎన్నికలు రాబోతున్న తరుణంలో డీఎస్సీ ప్రకటన చేశారు. కేవలం నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికే చేశారన్నది స్పష్టం. అయితే ఆ ప్రకటన కూడా ఇప్పుడు డోలాయమానంలో పడుతోంది.
ఎన్నికల కమిషన్ అనుమతిస్తే తప్ప డీఎస్సీ నిర్వహించడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించడం గమనార్హం. డీఎస్సీని వాయిదా వేయించాలంటూ.. ఇప్పటికే ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయిట. ఇలాంటి ఎత్తుగడ ద్వారా ఓటర్లను మభ్యపెడుతున్నారనేది ఆ ఫిర్యాదుల్లో సారాంశం. కేంద్ర కమిషన్ కు ఆ ఫిర్యాదులు పంపారట. తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదలనే ఆపు చేయించిన ఎన్నికల సంఘం.. ఏపీలో డీఎస్సీ పరీక్షను కూడా ఆపేయవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.