ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసహనంతో మండిపడుతున్నారట. చిరాకుగా కనిపిస్తున్నారట. తరచుగా తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఆయన మూడ్ అసహనంతో వేగిపోతున్నదని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అసహనం ఎందుకో తెలుసా.. కడప ఎంపీగా తన ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి మీద తన చెల్లెలు షర్మిల పోటీచేయబోతున్నందుకు కాదు, అయిదేళ్లపాటు ప్రతిసందర్భంలోనూ కాళ్లు మొక్కుతూ వచ్చినాకూడా.. ప్రధాని నరేంద్రమోడీ చంద్రబాబుతో జట్టుకట్టి, తన పతనానికి పనిచేస్తున్నందుకు మాత్రమే కాదు.. అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన తర్వాత.. సొంత పార్టీ వాళ్లే అనేక చోట్ల గోతులు తవ్వుతున్నందుకు కూడా కాదు. వీటన్నింటినీ మించి.. ఏపీలో ఎన్నికలు మే 13 వ తేదీనాటికి షెడ్యూలు అయినందుకు ఆయన అపరిమితమైన అసహనానికి గురవుతున్నారట.
జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రజలందరికీ కూడా డబ్బు పంచిపెట్టడం మీదనే ఆధారపడి తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పాలన అంటే.. ప్రభుత్వం సొమ్మును పంచిపెట్టేసి, అప్పులు తెచ్చి అందరి జేబులు నింపేసి.. అదే సంక్షేమం అని డప్పు కొట్టుకుని.. మీకందరకూ ఈ అయిదేళ్లలో ఇన్ని లక్షల డబ్బులిచ్చాను అని ప్రచారం చేసుకుని.. ఓటు బ్యాంకును స్థిరపరచుకోవడం మాత్రమే అని జగన్ అనుకుంటూ వచ్చారు. చిట్టచివరికి బటన్ నొక్కి డబ్బు వేస్తున్నా అనేది ఆయన ఊతపదంగా మార్చుకున్నారు. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది కరంగా మారింది.
సాధారణంగా.. ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు ఉంటాయని వైసీపీ అంచనా వేసింది. తదనుగుణంగనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందురోజు వరకు ఎడాపెడా బటన్లు నొక్కుతూ వచ్చారు. బటన్ ఇప్పుడు నొక్కుతున్నా, రెండు వారాల తర్వాత డబ్బులు పడతాయని చెప్పుకున్నప్పటికీ.. డబ్బు పంచేశాం అనే బిల్డప్ మాత్రం ఇచ్చారు. అలాగే నోటిఫికేషన్ కు ముందురోజే.. ఎప్పటినుంచో పెండింగులో ఉన్న ఉద్యోగుల డీఏ బకాయిలను కొంత మేర విడుదల చేసి వారికి కూడా బిస్కట్ వేశారు. అంతా కలిపి ఇంకోనెలలో ఎన్నికలు వచ్చేస్తాయి గనుక.. డబ్బు పుచ్చుకున్న ఆనందంలో ప్రజలు ఓట్లు గుమ్మరించేస్తారని అనుకున్నారు.
కానీ పరిస్థితి తిరగబడింది. ఎన్నికలు రెండునెలల దూరానికి వెళ్లాయి. మే 13న ఏపీలో పోలింగ్ జరగనుంది. అంటే ఏమిటన్నమాట? రెండునెలల పాటు జగన్ ఎలాంటి బటన్ నొక్కడానికి వీల్లేదన్నమాట. డబ్బులు పంచే పనులన్నీ ఇప్పుడు ఆగిపోతాయి. పెన్షన్లు వంటివాటి పంపిణీ మాత్రమే జరుగుతుంది. రెండునెలల పాటూ ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా ప్రజలకు అందదు. కొత్త పథకాలను ప్రకటించడానికి, కొత్త డ్రామాలకు తెరతీయడానికి ఉండదు. ప్రజలకు క్రమం తప్పకుండా బటన్ నొక్కడాన్ని అలవాటు చేసి.. రెండు నెలలు గ్యాప్ వస్తే జనం ఇన్నాల్లు చేసినదంతా మర్చిపోతారని జగన్ అసహనానికి గురవుతున్నారట. ఎన్నికల పోలింగ్ తేదీ అంత దూరంగా ఉండడం వలన వైసీపీ ఎన్నికల ప్రయోజనాలకు గండిపడుతుందని భయపడుతున్నారట. ఇప్పటికే ఎన్నికల ప్రచార రంగంలోకి దింపిన కిరాయి మూకలు అందరినీ, వారి ఖర్చులు దండగని భావించి, తిప్పి పంపేశారట. మొత్తానికి పోలింగ్ తేదీ.. జగన్ లో అసహనాన్ని పెంచుతున్నట్టుంది.