భారతీయ జనతా పార్టీ, జనసేనలతో పొత్తుల బంధం కూడా ఒక పెద్ద పాజిటివ్ అంశంగా పనిచేయనున్న నేపథ్యంలో.. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. తన ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అరిష్టాలు లేకుండా.. ఈ ప్రభుత్వ పదవీకాలంలో.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం కావాలని, అయిదేళ్లుగా పెండింగులో పడిపోయిన అసంపూర్తి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం అన్నీ కూడా ఆశావహంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయుడు మంచి ముహూర్తం ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఆరోజు సాయంత్రానికి ఫలితాల మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దానిని బట్టి.. 5వతేదీన బుధవారం ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆరోజున వైశాఖమాసం కృష్ణ చతుర్దశి అవుతుంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆరోజున ప్రమాణం చేయాలని పండితులు తెలుగుదేశం పెద్దలకు సూచించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే ఈసారి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీని కూడా చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో.. ఢిల్లీలో మోడీ ప్రమాణం ఎప్పుడు ఉంటుందో దానిని బట్టి తేదీల్లో మార్పుచేర్పులు అవసరం అవుతుంది. అందువలన.. 5వ తేదీ ప్రమాణం మిస్సయితే గనుక.. మూడురోజులు వాయిదా పడే అవకాశ: ఉంది. బుధవారం 5వ తేదీ మిస్సయితే గురువారం అమావాస్య గనుక ఆరోజున ముహూర్తం పెట్టుకోరు. శుక్రవారం7వ తేదీ పాడ్యమి రోజు కూడా శుభకార్యాలను చేపట్టడం జరగదు. అందువల్ల 8వ తేదీ శనివారం విదియ రోజు ప్రమాణ స్వీకారానికి బాగుంటుందని పండితులు సూచించినట్టు సమాచారం.
తెలుగుదేశం పార్టీకి ఈసారి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటిదాకా అన్నీ వారు అనుకున్నట్టుగానే నడుస్తున్నాయి. పొత్తులు కుదరడం గానీ, మిత్రపక్షాలకు ఇద్దరికీ కలిపి ఇవ్వదలచుకున్న సీట్ల సంఖ్యలో రాజీపడకుండానే.. పొత్తు కుదరడం గురించి గానీ.. అలాగే ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన గానీ.. అన్నీ గొప్పగా ఉన్నాయని అనుకుంటున్నారు. అందుకు సుముహూర్తంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరాలని ఇప్పటినుంచే అభిమానులు అనుకుంటున్నారు.