పొత్తు ధర్మాన్ని అనుసరిస్తూ తన సొంత పార్టీలో టికెట్లు దక్కని కీలక నాయకులను బుజ్జగించడంలో చంద్రబాబు నాయుడు అనూహ్య ఫలితాలు సాధిస్తున్నారు. మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాల్సి రావడం వలన ఐదేళ్లుగా తమ తమ నియోజకవర్గాలలో ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఇప్పుడు అవకాశం దక్కక అసంతృప్తితో ఉన్నవారికి ఆయన పొత్తుల యొక్క స్ఫూర్తిని అవసరాన్ని విడమరచి చెబుతూ ఒప్పిస్తున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తుల కారణంగా ఒక్క సీటును కోల్పోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సమగ్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుందనే అంశాన్ని చంద్రబాబు తన వారికి చెబుతున్నారు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ పిఠాపురంలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన వర్మను ఆయన బుజ్జగించడం. ఈ పరిణామంతో జనసేన సారథి పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో గెలుపుమార్గం సుగమం అయింది.
పిఠాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన వర్మ అప్పటి నుంచి కూడా ప్రజల్లో మమేకమై ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ వచ్చేసరికి మూడు పార్టీల పొత్తులు కుదరడానికి ఇరుసులాగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్.. తాను అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్నారు. ఆ విషయం ఆయన ప్రకటించిన వెంటనే అక్కడ వర్మ అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ పట్ల తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు.
సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వర్మ కూడా.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వర్మను ప్రత్యేకంగా ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించిన చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర క్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు పొత్తు ధర్మాన్ని అనుసరించి మిత్రపక్షాలకు సహకరించాల్సిన ఆవశ్యకతను ఆయనకు తెలియజేశారు. మొత్తానికి చంద్రబాబు వాదనకు వర్మ కూడా ఒప్పుకోవడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి శక్తివంచన లేకుండా సహకరిస్తారని వర్మ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఈ త్యాగం చేసినందుకు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలోనే ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం కల్పిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తానని వర్మ కూడా మీడియా ముందు చెప్పడంతో సమస్య తీరి పోయింది. పవన్ కళ్యాణ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక ఆయన విజయం నల్లేరుపై బండి నడికే అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.