వక్రబుద్ధి, వక్రభాష్యం.. చిచ్చుపెట్టే వైసీపీ కుట్రలు!

తెలుగుదేశం పార్టీలో పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతిరాగాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో అయినా సరే.. టికెట్ల ప్రకటన తర్వాత ఖచ్చితంగా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. పైగా తెలుగుదేశం ఈసారి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రాబోతున్నదని అనుకుంటున్న తరుణంలో పార్టీ టిక్కెట్ కోసం పోటీ అధికంగా ఉండడం సహజం. ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ దక్కుతుంది గనుక.. మిగిలినవాళ్లు మనస్తాపానికి గురికావడమూ సహజం. ఆ అసంతృప్త్తులను ఒక్కరొక్కరుగా బుజ్జగించుకుంటూ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.

అయితే ఈలోగానే వైసీపీ దళాలు వక్రపూరితంగా, వక్రబాష్యాలు, ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారాలతో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు పోస్టులు తయారుచేస్తూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నాయి. తప్పుడు భాష్యాలు చెబుతూ.. సాక్షాత్తూ కేంద్రహోం మంత్రి మాటలను కూడా వక్రీకరించి.. విపక్ష కూటమి పొత్తులో ముసలం పుట్టించడానికి వారు కుట్రలు చేస్తుండడం జరుగుతోంది. ఈ దుర్మార్గంలో వైసీపీ అనుకూల సోషల్ మీడియా దళాలతో పాటూ, సాక్షి దినపత్రిక కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది.

జనసేనాని పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత.. సహజంగానే అక్కడి తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇన్నేళ్లుగా ఆ పార్టీ ఇన్చార్జిగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వర్మ అసంతృప్తికి గురయ్యారు. ఆయన వర్గం అనుచరులు ఆందోళనకు దిగారు కూడా. ఆయనతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా.. ఆ అసంతృప్తిని వాడుకుని పార్టీలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ దళాలు కుట్ర చేసేశాయి. వర్మను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఒక లేఖను తయారుచేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసేశారు. పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఆ పోస్టును ఖండించాల్సి వచ్చింది.

ఇదొక ఎత్తు అయితే సాక్షి దినపత్రిక మరింత దిగజారి వ్యవహరించడం విశేషం. తెలుగుదేశం, బిజెపి పొత్తుల్లో ముసలం పుట్టించడానికి వారి కుట్రలు వారు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియాటుడే కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇదివరకు కూడా ఎన్డీయేలో భాగస్వామేనని, ఆయనను తాము వెళ్లమనలేదని, ఆయనంతట ఆయనే వెళ్లిపోయారని, నిజం తెలుసుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఎన్డీయేలోకి మళ్లీ వచ్చారని మాత్రమే’ అన్నారు. అమిత్ షా after realising అనే మాటను మాత్రమే వాడారు. అయితే ఆయన మాటలకు వక్రభాష్యం పులిమిన సాక్షి దినపత్రిక, ‘చంద్రబాబుకు  బుద్ధొచ్చింది. బుద్ధొచ్చిన తర్వాత తిరిగి ఎన్డీయేలోకి వచ్చారు’ అని అమిత్ షా అన్నట్లుగా ప్రచురించింది. అచ్చంగా పార్టీ కార్యకర్తల్లో కోపం పుట్టించడానికి, ఆ రకంగా పొత్తుల మైత్రిని చెడగొట్టడానికి సాక్షి , వైసీపీ కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories