కమలంలో ‘నీలి’దళం.. పొత్తులపై కుట్ర!

ఇన్నాళ్లూ తెరవెనుకగా ఉండి జగన్మోహన్ రెడ్డి కోవర్టులుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చిన వారు.. ఇప్పుడు తమ ముసుగు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. పేరుకు భాజపాలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో జగన్ పాలన గురించి భజన చేస్తూ, జగన్ ప్రభుత్వ నిర్ణయాలను సుతిమెత్తగా విమర్శిస్తూ, అదే సమయంలో చంద్రబాబు మీదకు పాపాలను నెట్టేస్తూ వ్యూహాత్మకంగా పనిచేసిన ఏపీలోని కమలదళం.. ఇప్పుడు ఇక తెగించేస్తున్నారు. తమ ముసుగు తొలగిపోయినా పరవాలేదనుకుని.. అధిష్ఠానానికి లేఖాస్త్రం సంధించారు. పొత్తులు సరిగా లేవని, చంద్రబాబునాయుడును నమ్మడం వలన పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆ లేఖలోని సారాంశం. 8 మంది నాయకులు ఈ లేఖ రాసిన వారిలో ఉండడం విశేషం.

కుట్ర రాజకీయాలు, కోవర్టు రాజకీయాలు ఇటీవలి కాలంలో చాలా మామూలుగా మారిపోయాయి. అలాగే ఏపీ బిజెపిలో కూడా పలువురు జగన్ కోవర్టులు ఉన్నారు. జగన్ ఏలుబడిలోకి వచ్చిన తర్వాత.. ఆయన ద్వారా వక్రమార్గాల్లో లబ్ధి పొందుతూ ఆయన వ్యవహారాలను చూసీచూడనట్టు వెళ్లడం, సందర్భం వస్తే ఆయనకు మేలుచేసేలా మాట్లాడ్డం వారికి జగన్ అప్పగించిన డ్యూటీ.

ఇప్పుడు ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ కు పరోక్షభజన చేస్తూ ఆటలాడడం వారికి కుదరని వాతావరణం ఏర్పడింది. మోడీ స్వయంగా ఏపీకి వచ్చి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించే పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి కోవర్టు ఆపరేషన్ లో చివరి అంకంలాగా.. అసలు ఈ పొత్తులు సరిగా లేవు.. పొత్తురూపంలో మన పార్టీకి ద్రోహం జరుగుతున్నది.. మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. మన పార్టీకి కేటాయించిన సీట్లేవీ తెలుగుదేశానికి పెద్దగా బలం ఉన్న సీట్లు కాదు. వాటిలో మనం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదు.. మనం ఒక్క ఎంపీ స్థానాన్నికూడా గెలిచే అవకాశం లేదు. ఎమ్మెల్యేలుగా ఎంపిక చేసిన అభ్యర్థులు చంద్రబాబు మనుషులే అంటూ రకరకాల ఆరోపణలో వారు భాజపా అధిష్ఠానానికి ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో.. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణవర్దన్ రెడ్డి, ఇంకా ఎస్.మాలతీరాణి, శాంతారెడ్డి, దయాకర్ రెడ్డి, పాకా సత్యనారాయణ, వి సూర్యనారాయణ రాజు, కె.సురేంద్రమోహన్, జూపూడి రంగరాజు తదితరులు ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ స్థాయినుంచి అమరావతి స్థాయి వరకు అనేకమంది మేధావులతో సమాలోచనలు జరిపి, తర్జనభర్జనలు పడి తమకు ఏవి అనుకూలంగా ఉంటాయో అలాంటి సీట్లను ఎంచుకుంది. అయితే భాజపా ఢిల్లీ పెద్దలు మూర్ఖులు వారికి ఏమీ తెలియదు, వారి నిర్ణయాలు లోపభూయిష్టం అని ధ్వనించేలా.. ఇప్పుడు పార్టీ పొందిన అన్ని సీట్లలో మనం ఓడిపోతాం అంటూ ఈ నాయకులు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. మరి పార్టీ వీరి పితూరీని పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా, వీరే ఇలా బురద చల్లేసి నెమ్మదిగా పార్టీని వీడి తమ దారి తాము చూసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories