ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బరితెగింపు రాజకీయాలు పెరుగుతున్నాయి. నాయకులు మాత్రమే కాదు.. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వ సేవకులుగా ఉన్నవారు కూడా బరితెగించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీరు వ్యవస్థ.. ఇప్పుడు ఓటర్లను మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి ఆ పార్టీకి ఒక సులువైన అడ్డదారిలాగా కనిపిస్తోంది. వాలంటీర్లను వాడుకుంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థని చాలా దూరదృష్టితో, వక్రబుద్ధితో రూపకల్పన చేశారు. పైనుంచి చూడడానికి ప్రభుత్వ పథకాలను పేదల ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి అందజేసే వ్యవస్థగా అది కనిపిస్తుంది. కేవలం తక్కువ మొత్తాలను గౌరవవేతనంగా పొందుతూ, క్షేత్రస్థాయిలో ఏ లబ్ధిదారునికీ కించిత్ ఇబ్బంది లేకుండా చూడడానికి ఈ వ్యవస్థ అని మనకు అనిపిస్తుంది. కానీ.. ఆ ముసుగులో పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెందిన వారిని, వారి తొత్తులను, తైనాతీలను ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశపెట్టారు. వారంతా తొలిరోజు నుంచి కూడా వాలంటీర్లు అనే ముసుగు తగిలించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లాగానే పనిచేస్తున్నారు.
వాలంటీర్లతో పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశాలు నిర్వహించిన ప్రతిసందర్భంలోనూ జగన్ ను మళ్లీ గెలిపించడానికి వారు పాటుపడాలని ఉద్బోధిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చాక ఆ వాలంటీర్లంతా మరింతగా బరితెగిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా మరింత బరితెగింపుతో వాలంటీర్లకు డబ్బులు భారీ ముట్టజెబుతూ.. వారిని ప్రజల మీదికి ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంగా చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ రకంగా డబ్బుకు అమ్ముడుపోయిన వాలంటీర్లు సంక్షేమ పథకాల అమలు ముసుగులో ఇంటింటికీ వచ్చి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించబోతున్నారు. ఒకవైపు ఇప్పుడున్న పథకాలేవీ ఆగవు, మరింత సమర్థంగా అమలు చేస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెబుతూనే ఉన్నప్పటికీ.. జగన్ ఓడిపోతే.. పెన్షన్లు రావు, పథకాలు ఏవీ ఉండవు అని ప్రజలను భయపెట్టడానికి వాలంటీర్లు తెగిస్తున్నారు. ఇలా అమ్ముడుపోయిన వాలంటీర్లు చెప్పే మాటల పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓటు అనేది తమ సొంత విచక్షణను బట్టి, తమ బుద్ధికి ఏ నాయకుడు మంచి వాడనిపిస్తే, ఏ పార్టీ మంచిదనిపిస్తే వారికి వేయాలే తప్ప.. అమ్ముడుపోయిన వాలంటీర్లు చెప్పే చెప్పుడు మాటలు విని వేయకూడదని ప్రజలు తెలుసుకోవాలి.