డిజిటల్ యుగం ఇది. ఏదో సినిమాలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన హీరో చెప్పినట్టు.. ఏ పని చేయదలచుకున్న సరే చిటికెలో అయిపోతుంటుంది. అలాంటిది చిటికెలో అయిపోయే మామూలు వ్యక్తుల యొక్క మామూలు పనులు కూడా ఆలస్యం అవుతున్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగానే చిటికెలో అయిపోయే పనులు, సాక్షాత్తూ ముఖ్యమంత్రి తలచుకుంటే చిటికెలోని వెయ్యోవంతులో అయిపోతాయని కదా ప్రజలు ఆశిస్తూ ఉంటారు. కానీ.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వారంరోజులు వేచిచూడండి అని చెప్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు! సంక్షేమ పథకాల నిధుల్ని తమరు ఏమైనా ఎద్దుల బండిమీద పంపుతున్నారా జగన్ అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కంగారుగా అడుగులు వేస్తున్నారు. నేడో రేపో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకసారి కోడ్ అమల్లోకి వచ్చిందంటే.. ఇక విచ్చలవిడిగా సంక్షేమ పథకాల ముసుగులో ప్రజలకు డబ్బు పంచిపెట్టే వ్యవహారాలు ఆగిపోతాయి. సర్కారు ఖర్చుతో, గ్రామీణ మహిళలు, లబ్ధిదారుల్ని బలవంతంగా పోగేసి పెద్ద బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా వీలుపడదు. అందుకే చకచకా అనేక కార్యక్రమాలు బిజీ షెడ్యూలుతో నిర్వహించేస్తున్నారు. బటన్ నొక్కేస్తున్నా.. మీ ఖాతాల్లో డబ్బులు వేసేస్తున్నా అనే పనులు ఏకబిగిన చేసేస్తున్నారు.
ఎన్నికల కోడ్ వచ్చేలోగా ప్రజలను వీలైనంత జాస్తిగా మభ్యపెట్టాలనిచ చూస్తున్న జగన్మోహన్ రెడ్డి.. బటన్ నొక్కుడులు సిరీస్ లో చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. అప్పులు పుట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఈబీసీ నేస్తం పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత బటన్ నొక్కడు కార్యక్రమం పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో గురువారం సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం గురించి డప్పు కొట్టడానికి కోటిన్నరకు పైగా సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపేణా చెల్లింపులు మాత్రం చేశారు. లబ్ధిదారులకు 629 కోట్లు ఇచ్చేస్తున్నానంటూ బటన్ నొక్కారు.
ముందే చెప్పినట్టు ఈ డిజిటల్ యుగంలో ఇలా బటన్ నొక్కితే అలా ఖాతాల్లో డబ్బులు పడాలి కదా అనుకున్న వారికి షాక్ తప్పలేదు. డబ్బు రాలేదు. ప్రస్తుతానికి బటన్ మాత్రమే నొక్కుతున్నానని, వారం రోజుల తర్వాత డబ్బులు పడతాయని జగన్ స్వయంగా వెల్లడించారు. ఖాతాల్లో డబ్బులు పడడం లేదని లబ్ధిదారుల గోడును ప్రపంచానికి తెలియజెబుతున్న ఈనాడు, జ్యోతి పత్రికలను ఈ వారం రోజుల పాటు చూడనే వద్దు అంటూ జగన్ ప్రజలకు సలహా ఇవ్వడం ఇంకా వింత.
డబ్బుల్లేకపోయినా సరే జనాన్ని మభ్యపెట్టే డ్రామాలు నడిపించడంలో జగన్ ఆరితేరిపోయారని ప్రజలు ఈసడించుకుంటున్నారు.