ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాలను శనివారం విడుదల చేయబోతున్నారు. కడపలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న జగన్, ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లి, అక్కడ తండ్రి సమాధికి నివాళులు అర్పించి.. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో కూడా జగన్, ఇక్కడినుంచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సారి అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. అయితే.. ఆయన జాబితాకు తుదిరూపు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆల్రెడీ ప్రకటించిన నియోజకవర్గ ఇన్చార్జిలు అందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుబులుగా, భయంభయంగా ఎదురుచూస్తున్నారు.
పార్టీ పరంగా అనేక కసరత్తులు చేస్తూ, సర్వేలు చేయించుకుంటూ నివేదికలు అధ్యయనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి సిటింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మారుస్తూ జగన్ రకరకాల ప్రయోగాలు చేశారు. ఎమ్మెల్యేలను ఏదో ఉద్యోగుల్లాగా అటూఇటూ బదిలీ చేయడం ఆయనకే చెల్లిందనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా జగన్ 12 జాబితాలు విడుదల చేశారు.
అయితే ఆ జాబితాల్లో ఆయన చాలా తెలివితేటలు ప్రదర్శించారు. ఏ ఒక్కరినీ కూడా ‘అభ్యర్థి’గా ప్రకటించలేదు. అందరినీ ‘నియోజకవర్గాల ఇన్చార్జి’గానే వ్యవహరిస్తూ వచ్చారు.
ఒకసారి జాబితాలో ప్రకటించిన తర్వాత.. నెక్ట్స్ జాబితాలో వారిని మార్చేయడం వంటివి కూడా అనేకం జరిగాయి. ఇలాంటి తికమక వ్యవహారాలు సాగుతుండడంతో.. ఏ ఒక్కరూ కూడా తమను ఇన్చార్జిగా ప్రకటించినంత మాత్రాన అభ్యర్థిత్వం తమదే అనే ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కాన్సంట్రేట్ చేయడం లేదు. తీరా ఇప్పెుడు జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ముహూర్తం నిర్ణయించాక.. వారిలో భయం ఇంకా పెరుగుతోంది.
అభ్యర్థుల జాబితాలో తమకు స్థానంలో ఉంటుందో లేదో అనే భయం అనేకమంది ‘నియోజకవర్గ ఇన్చార్జి’ల్లో ఉంది. జగన్ బుద్ధి క్షణానికో రకంగా మారుతూ ఉంటుందని, నిన్న తమ పేర్లు ఇన్చార్జి జాబితాలో కనిపించినా, రేపు అభ్యర్థుల జాబితాలో ఉండకపోవచ్చుననే భయం వారిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికి ప్రకటించిన పేర్లలో కొంతమందిని ఖచ్చితంగా మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిని బుజ్జగించే పనులను ఇప్పటికే జగన్ తరఫున పార్టీ పెద్దలు స్వీకరించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఎవరో తేలిపోయినందున, ఆయా నియోజకవర్గాల్లో వారిని దీటుగా ఎదుర్కోవాలనే ఆర్థిక, కుల సమీకరణాలను లెక్కవేసుకుని అనేక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చవచ్చునని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ మీద పోటీచేయడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత ఇన్చార్జి వంగా గీతను, అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే వంగా గీతను కాదని, ముద్రగడ పద్మనాభం కొడుకు గిరిని రంగంలోకి తెస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పాపం.. జగన్ ఆడుతున్న ఆటలో ఎందరు ఇన్చార్జిలు అభ్యర్థిత్వాలను దక్కించుకోగలరోర వేచిచూడాలి.