పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నట్టుగా ప్రకటించిన పవన్ కల్యాణ్.. అక్కడ తన ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా? అనూహ్యమైన రాజకీయ ఎత్తుగడలతో ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేయబోతున్నారా? గత ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్థి వర్మ వర్గం నుంచి ఒకవైపు సహాయ నిరాకరణ ఉంటుందని, అంతకుమించిన ప్రతికూలత కూడా ఉండవచ్చుననే అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిని కూడా అధిగమించేలాగా.. ఆయన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారా? అనే చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తోంది.
ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పోటీచేయడం ఖరారు అయిన తర్వాత.. ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి జనసేనలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెండెం దొరబాబు 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మ మీద ఇంచుమించు 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయినా సరే.. ఈ ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యేను జగన్ పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారనే కారణాలు కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేగా పనితీరులో లోపాలుగానీ, అవినీతి గానీ ఉన్నట్టుగా గతంలో పలుమార్లు నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశాల్లోజగన్ సంకేతాలు కూడా ఇవ్వలేదు. అలాంటి నేపథ్యంలో పెండెం దొరబాబులో సహజంగానే అసంతృప్తి పెల్లుబికింది. కొత్త ఇన్చార్జిగా వంగా గీతను ప్రకటించిన తర్వాత కూడా.. చివరినిమిషం వరకు ఏమైనా జరగవచ్చునంటూ పెండెం దొరబాబు సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు.
గత ఎన్నికలను గమనిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45 శాతం ఓట్లు రాగా, తెలుగుదేశానికి 37 శాతం, జనసేనకు 15 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీని ఓడించడం చాలా సులువు. కానీ తెదేపా తరఫున పోటీచేసి ఓడిపోయిన వర్మ వర్గంలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీచేసే ఆలోచన కూడా ఉన్నదని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో వర్మ వర్గం ఓట్లుచీలిపోయే ప్రమాదం ఉంది. ఈ గండానికి విరుగుడుగా పెండెం దొరబాబును తన జట్టులో కలుపుకోవడానికి పవన్ కల్యాణ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే సిటింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు ఉండగల ఆదరణ, వైసీపీ ఓట్లలో ఆయన వర్గానికి ఉండే ఓటు బ్యాంకు పవన్ కు అదనంగా కలిసి వస్తాయి.
శాసనసభలో అడుగుపెట్టి ట తన ముద్ర చూపించాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ అనేక కోణాల్లో లెక్కలు వేసుకుని, సర్వేలు చేయించిన తర్వాతే, వ్యతిరేకతలను అసమ్మతులను అంచనా వేసిన తర్వాత పిఠాపురం ఎంచుకున్నారు. ఈ వ్యూహంతో ఆయన ఏం ఫలితం సాధిస్తారో చూడాలి.