బిస్కట్లు పంచినట్టుగా ప్రభుత్వ ఖజానాలోని సొమ్ములను, ప్రజల్లో తమ పార్టీకి చెందిన అయినవారిని ఎంచుకుని వారికి యథేచ్ఛగా దోచిపెట్టడానికి ఉద్దేశించిన పథకం కాదు ఇది. ఏపీలోని విద్యార్థినులను ఉన్నత విద్యకు ప్రోత్సహించడంలో ఒక అద్భుతమైన పథకం. పేదలు తమ ఇంటి ఆడబిడ్డల పైచదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చయినా సరే.. వెనుకాడే దుస్థితి లేకుండా ప్రోత్సహించడం ఈ పథకం ప్రథమ లక్ష్యం. అలాగని ప్రభుత్వ ఖజానాకు చిల్లిపడిపోకుండా స్థిరత్వం ఉండేలా చూడడం రెండో లక్ష్యం. అంతిమంగా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడపిల్ల కూడా డబ్బు లేమి కారణంగా పై చదువులకు దూరమయ్యే అవకాశం లేని వాతావరణం సృష్టించడం, తద్వారా అత్యుత్తమ విద్యాప్రమాణాలు కలిగిన భవిష్యత్ మహిళా సమాజాన్ని సృష్టించడం ఈ పథకం యొక్క పరమలక్ష్యం.
చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇస్తున్న ‘కలలకు రెక్కలు’ పథకానికి సంబంధించి తన నివాసంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం పూర్తి స్వరూప స్వభావాలను వివరించారు. ఈ పథకం కింద విద్యార్థినుల ఉన్నత విద్యకోసం అవసరమయ్యే రుణాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయిస్తుంది. అయితే.. ఆ రుణాలు ఎంత పెద్దమొత్తమైనా కావొచ్చు గాక.. వాటికి సంబంధించి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
రకరకాల పథకాల పేరుతో నిధులు బదిలీచేస్తూ, పేదలకు సాయం అందిస్తున్నామని చెప్పుకునే పథకాలను అయినవారికి, తమ సొంత పార్టీ వారికి దోచిపెట్టడం కోసమే అనేక ప్రభుత్వాలు వాడుకుంటూ ఉంటాయి. అదే సమయంలో పైచదువులకు పూర్తి సాయం అందించడం అంటే.. ఆ భారం ఖజానా మీద తడిసి మోపెడు అవుతుంది. పైగా సాయం పేదల్లో అందరికీ అందే అవకాశం లేదు. అలాంటి శషబిషలేమీ లేకుండా.. చంద్రబాబునాయుడు ఈ ‘కలలకు రెక్కలు’ అనే పథకానికి రూపకల్పన చేశారు. ప్రతి ఆడబిడ్డ చదువులకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు రుణాలు ఇప్పించడం అంటే.. ప్రజలకు ఇబ్బంది ఉండదు. అలాగే ఖజానా మీద పడే భారం కూడా తక్కువగానే ఉంటుంది.
యావత్తు సమాజం క్రమానుగతమైన వికాసానికి, విద్యార్థినుల సంక్షేమానికి ఇది అద్భుత పథకం అనే చెప్పాలి. ఒకసారి ఈ ‘కలలకు రెక్కలు’ పథకం అమల్లోకి వస్తే.. ఇతర రాష్ట్రాలు అన్నీ కూడా ఇలాంటి ఆలోచనను అనుసరించి తీరాల్సిందేనని.. ఈ పథకం గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.