ఒకవైపేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ ఒక బహిరంగ సభ నిర్వహిస్తుంటే చాలు.. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ 500 రూపాయల డబ్బు, క్వార్టర్ బాటిల్ మద్యం ఇస్తున్నారు. మహిళలకు ఇతర తాయిలాలు అందిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్న ముద్రగడ పద్మనాభం మాత్రం.. తన వెంట వచ్చే వారికి కనీసం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం లేదంటూ ముందుగానే హెచ్చరించేశారు. ఈ మేరకు తన అభిమానులు (?) అందరకూ ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం.. అందులో రెండు అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒకటి- తన ర్యాలీ తాడేపల్లికి వెళ్లే రూట్ మ్యాప్ కాగా, రెండోది- తన వెంట తాడేపల్లికి వచ్చేవాళ్లు ఎవరి ఆహారం, ఇతర అవసరాలు తమతో పాటు తమ వాహనంలోనే తెచ్చుకోవాలనే సూచన.
ముద్రగడ పద్మనాభం.. ఈనెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కిర్లంపూడి గ్రామంలోని తన ఇంటినుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి సాయంత్రానికి తాడేపల్లి చేరుకోవాలనేది ముద్రగడ ప్లాన్ గా ఉంది. అయితే చాలా పెద్ద ర్యాలీగా వందల వాహనాలతో తాడేపల్లికి వెళ్లడం ద్వారా.. రాష్ట్రంలోనే కాపు కులానికి చలా పెద్ద నాయకుడిని అని జగన్ వద్ద బిల్డప్ ఇచ్చుకోవడం ముద్రగడ టార్గెట్గా ఉంది. ఈ టార్గెట్ ను అందుకోవడానికి ఆయన ఇప్పటికే తన అనుచరులకు అభిమానులకు ఫోను ద్వారా వర్తమానాలు పంపుతున్నారు. ఎన్ని వీలైతే అన్ని అదనంగా కూడా వాహనాలు తీసుకుని తాను వైసీపీలో చేరే ర్యాలీకి రావాలని ఆయన ఆహ్వానిస్తున్నారు.
ముద్రగడ ఆహ్వానాలు పంపడం బాగానే ఉంది. అయితే అధికార పార్టీలోకి వెళుతున్న ఆయన తనకోసం వస్తున్న వారికి కనీసం భోజనవసతి కూడా కల్పించలేని విధంగా మాట్లాడడం బాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వెంట ర్యాలీ ఒకేసారి బయల్దేరుతుంది గనుక.. మార్గమధ్యలో ఒక చోట లంచ్ ఏర్పాటుచేసి ఉంటే చాలా గౌరవంగా ఉండేదని, ఇలా తన వెంట వచ్చేవాళ్లని తమ భోజనాలు తమతోనే కారులో తెచ్చుకోవాలని అనడం బాలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ముద్రగడ వైసీపీలో చేరికకు కాపు వర్గం నుంచి ఎంత మేర మద్దతు లభిస్తుందనేది
సందేహాస్పదంగా ఉంది. అదే సమయంలో.. కాపులు కాకపోయినప్పటికీ.. ఆయన వైసీపీ నాయకుడిగా ప్రచారంలో తమకు ఉపయోగపడగలరని నమ్ముతున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని వైసీపీ నాయకులు మాత్రం.. ఆయన ర్యాలీకి వాహనాలు పంపడానికి తమ వంతు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గం మద్దతు మాత్రం లభించడం లేదు. వైసీపీ వారు ప్రతి సభకు బీభత్సంగా ఎంజాయ్ చేస్తోంటే.. ముద్రగడను నమ్మినందుకు తాము తమ తిండీతిప్పలు తామే చూసుకోవాలా? అని జనం పెదవి విరుస్తున్నారు.