అయిదులోంచి ఒకటి తీసివేస్తే.. మిగిలేది ఎంత? ఒకటో తరగతి పిల్లవాడు కూడా ‘నాలుగు’ అని జవాబు చెబుతాడు. కానీ జగనన్న చదువుకున్న లెక్కల పుస్తకంలో మాత్రం ‘మూడు’ అనే జవాబే ఉంటుంది. తొందరగా మళ్లీ ముఖ్యమంత్రి అయిపోవాలనే తాపత్రయం ఆయన కళ్లకు బైర్లు కమ్మేలా చేస్తోందో, బుద్ధిని మసకబారేలా చేస్తోందో తెలియదు గానీ.. ఆయన మాత్రం.. ఇంకో మూడేళ్లలో తాను ముఖ్యమంత్రిని అయిపోతానని మైకు దొరికిన ప్రతిసందర్భంలోనూ పదేపదే చెప్పుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా కూడా ఆయన ఇదే సంగతి చెప్పుకున్నారు. మన దేశంలో అయిదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయనే సంగతి ఆయనకు తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా ఒక్క సంవత్సరం కూడా పూర్తికాలేదని కూడా ఆయనకు తెలుసు. కానీ ఫైనల్ గా డైలాగ్ దగ్గరకు వచ్చేసరికి.. మూడేళ్లలో జగన్ 2.ఓ ప్రభుత్వాన్ని మీరు చూస్తారు.. అంటూ ఆయన సెలవిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వద్ద పార్టీ కార్యకర్తలతో మాట్లాడడానికి కొన్ని స్టాక్ సబ్జెక్టులు ఉంటాయి. ఆయన కొన్ని వందల వేల సార్లు అవే విషయాలు మాట్లాడి ఉంటారు. ఆ సంగతులు ఆయన పార్టీ వారందరికీ కూడా కంఠతా వచ్చేసి ఉంటాయి. ఫరెగ్జాంపుల్- మనం రాష్ట్రంలో ఏ ఇంటికైనా సరే గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పనులు మనం చేసి చూపించాం. చంద్రబాబు మేనిఫెస్టో లో హామీలు పట్టించుకోరు.. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు.. ఏవీ చేయలేదు. ఆయన పాలనలో ఈ కొద్దికాలంలోనే వ్యవస్తలన్నీ నిర్వీర్యం అయిపోయాయి… ఇలాంటి ఆయన చేసే రొటీన్ విమర్శలు.
ఈసారి మాత్రం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహారాల నేపథ్యం ఉన్నది గనుక.. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, న్యూటన్స్ లా ప్రకారం ప్రతిచర్య ఉంటుందని.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతారో అంతే వేగంతో అది పైకిలేచి ఆయనకే తగులుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కళ్లుమూసుకుంటే మూడేళ్లయిపోతుంది. ఈ మూడేళ్లు నాకు, ప్రజలకు గట్టిగా తోడుగా నిలబడండి.. తర్వాత వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.
హామీలు ఇతర వ్యవహారాల గురించి ఆయన వేసే నిందలన్నీ పక్కన పెడితే.. ఈ మూడేళ్లలో అధికారంలోకి రావడం అనే పిచ్చి జగన్ కు ఎలా పట్టుకున్నదబ్బా.. అనే సందేహం పలువురిలో మెదలుతుంది. ఆయన నమ్మే, పాదనమస్కారాలు చేసే స్వామీజీలు ఎవరైనా మూడేళ్ల తర్వాత.. నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అని జోస్యం చెప్పారా.. దాన్ని నమ్ముకుని లాజిక్ లేకుండా ప్రజల ముందు ప్రతిసారీ.. మూడేళ్లలో జగన్ 2.0 పాలన అని చెప్పుకుంటూ ఆయన అపహాస్యం పాలవుతున్నారా? అని ఆయన పార్టీ కార్యకర్తలకే సందేహాలు కలుగుతున్నాయి. జగన్ అధికారంలోకి మళ్లీ రావాలనే కోరికను, వస్తాననే నమ్మకాన్ని చాటుకోవచ్చు గానీ.. మూడేళ్లు అంటూ నవ్ల్వులపాలవడం దండగ అని వారు పేర్కొంటున్నారు.