5 లేదా 8 న బాబు ప్రమాణం : 5కే అందరి మొగ్గు!

చంద్రబాబునాయుడు ఉండవిల్లిలోని ఇంటివద్ద బయలుదేరినా, ఆయన కాన్వాయ్ వెళుతుండగా… రోడ్డు పక్కన జనసందోహం ఉన్నా.. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ చేరుకున్నా.. ఎక్కడ ఉంటే అక్కడ.. ఆయన చుట్టూ ‘‘సీఎం సీఎం’’ అనే నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చంద్రబాబు పరిసరాలన్నీ సీఎం కాబోతున్నారనే ఆవేశంతో ఊగిపోతున్నాయి. ఆయనే స్వయంగా పూనుకుని.. ఈ హర్షధ్వానాలను ఇంతకంటె ఉత్సాహంగా మిన్నంటేలా రేపు (మంగళవారం) వినిపించడానికి కాస్త శక్తి దాచుకోవాలని కార్యకర్తలకు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు నెగ్గిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేది ఎఫ్పుడు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ గతంలో కంటె ఎక్కువ సీట్లు గెలుస్తుందని మేకపోతు గాంభీర్యంతో ప్రకటించిన తరువాత.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నంలో 9వ తేదీన జగన్ ప్రమాణం ఉంటుందని తేల్చేశారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం జగన్ ముహూర్తం కంటె ముందే ప్రమాణం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మేరకు చంద్రబాబునాయుడుకు అలవాటైన పురోహితులు, పంచాంగకర్తలను సంప్రదించి.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి మంచి ముహూర్తం చూడాలని కోరినట్టుగా సమాచారం.
ఫలితాలు మంగళవారం 4వ తేదీ సాయంత్రానికి వెలువడతాయి. అదేరోజు ప్రమాణం అనేది సాధ్యం కాదు. పైగా మంగళవారం గనుక చేయరు.
ఇకపోతే 5వ తేదీ చతుర్దశి అవుతుంది. చెడ్డ రోజు కాదు గానీ.. గెలిచిన వెంటనే అధికారం అందుకోవాలనుకుంటే 5వ తేదీన చేసే అవకాశం ఉంది. 6 వతేదీ అమావాస్య, 7న పాడ్యమి! ఆ రెండు రోజుల్లో ఎవ్వరూ ఏ పనులూ ప్రారంభించరు.
జూన్ 8, 9 రెండు తేదీలూ బాగానే ఉంటాయని ఒక ప్రతిపాదన వచ్చింది. జూన్ 8న తిథి విదియ వస్తుంది, 9వ తేదీన తదియ తిథి అవుతుంది. విదియ తదియలందు విభవమ్ము చేకూరు అంటూ.. ఆ తిథులలో మంచి పనిని ప్రారంభిస్తే.. దిగ్విజయం అవుతుందని సామెత. అయితే జగన్ క్రిస్టియను గనుక.. ఆ సెంటిమెంటు కూడా జోడించి ఆదివారం 9వ తేదీ ముహూర్తం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబునాయుడు 8వ తేదీన చేయవచ్చునని అంటున్నారు.
పార్టీలో కొందరు 8వ తేదీన విదియనాడే ప్రమాణం అని మొగ్గుతున్నప్పటికీ.. కార్యకర్తలు నాయకుల్లో ఎక్కువ మంది 5వ తేదీనే ప్రమాణం చేయాలని పట్టుపడుతున్నారు. జగన్ ను ఓడించిన తర్వాత.. కనీసం ఒక్క రోజు అయినా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండనివ్వరాదని వారు భావిస్తున్నారు. జగన్ ను ఓడించిన తక్షణం ఇంటికి పంపాలంటే.. 5న ప్రమాణమే మేలంటున్నారు. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories