సాధారణంగా ప్రభుత్వాలు మారి కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే.. ఆ పార్టీలతో పరిచయాలు ఉన్నవారు రకరకాల ప్రణాళికలతో వెళతారు. తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకుంటారు. కానీ ఇప్పుడు వెలుగుచూస్తున్న వ్యవహారాలను గమనిస్తే ఏలా ఉన్నదంటే.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆయన వద్దకు సంక్షేమ ప్రణాళికలతో కాదు.. అక్రమార్జనల ప్లాన్ లతో వెళ్లాలి. ఎవరు ఎక్కువ దోచుకునే ప్లాన్ తో వెళితే.. వారికి అంత పెద్ద పదవులు దక్కుతాయి అన్నట్టుగా ఆయన పరిపాలన సాగిందా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా నెలకు దాదాపు 30-40 కోట్ల దోపిడీ ప్లాన్ తో వెళ్లినందుకే ఎం. మధుసూదన్ రెడ్డికి జగన్ పెద్దపీట వేశారా అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఆయన లీలలు గమనిస్తే అందరూ విస్తుపోవాల్సిందే.
2020 మే 19న మధుసూదన్ రెడ్డిని ఫైబర్ నెట్ ఎండీగా జగన్ నియమించారు. ఆయన రాకముందు నెలవారీ చందా 199 రూపాయలు మాత్రం ఉండగా.. ఆయన వచ్చిన తర్వాత 599 రూపాయలకు పెంచారు. అయినా సరే నెలవారీ ఆదాయం 12 కోట్లకు పడిపోయింది. మామూలుగా 17కోట్లు వచ్చే మొత్తం కాస్తా, నెలవారీ అద్దె పెంచిన తర్వాత మూడు రెట్లు పెరిగి 51 కోట్ల వరకు రావాలి. పెంపు వలన కొన్ని కనెక్షన్లు పోయినప్పటికీ… కనీసం 45 కోట్ల వరకు రావాలి. కానీ అలా జరగలేదు.
ఇందులో చిన్న మతలబు పెట్టారు. గతంలో 9.7 లక్షల కనెక్షన్లు ఉండగా వాటి సంఖ్య ఈ నాలుగేళ్లలో 7.5 లక్షలకు పడిపోయినట్టుగా చూపించారు. పైగా నాలుగు లక్షల కనెక్షన్లకే లెక్కలు చూపించారు. అలా అనుకున్నా కూడా దాదాపు 25 కోట్ల వరకు రాబడి రావాలి. కానీ నికరాదాయానికి గండికొట్టారు.
పోయిన కనెక్షన్లు అని చూపిన వాటినుంచి నెలవారీ డబ్బు మాత్రం వసూలు చేసి ప్రెవేటు ఖాతాలకు తరలించుకున్నారని ఆరోపణలు నిరూపణ అయ్యాయి. ఒక ప్రత్యేక యాప్ తయారుచేయించి.. ఆ మార్గంలో వసూలు చేసిన ప్రతిరూపాయీ బొంబాయిలోని ఖాతాలకు చేరినట్టు తేలింది.
ఇదొక దందా అయితే.. ఫైబర్ నెట్ లో తెదేపా హయాంలో 120 ఉద్యోగులతో నడుస్తుండగా.. ఇప్పుడు వారి సంఖ్య 1350కు పెరిగింది. వైసీపీ ముద్ర వారినందరినీ పెద్దజీతాలతో తీసుకుని సంస్థను ముంచారనే ఆరోపణలున్నాయి. ఇన్ని అక్రమాలు జరిగినందునే ఫైళ్లు తగలబెట్టారని కూడా అంటున్నారు. మొత్తానికి మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లోతుగా విచారణ సాగితే.. నెలవారీ స్వాహా చేసిన దాదాపు 30-40 కోట్ల రూపాయలను ఎందరెందరు పంచుకున్నారో తేలుతుందని ప్రజలు భావిస్తున్నారు.