2019 vs 2024 : భారీ పోల్ పర్సెంటేజీ సంకేతాలేంటి?

సాధారణంగా ఎన్నికల రణరంగంలో ఎప్పుడైనా సరే.. పోల్ పర్సెంటేజీ భారీగా నమోదు అయిందంటే.. ఓటర్ల మీద ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తున్నట్టు లెక్క! ఇది ఒక సార్వజనీనమైన సిద్ధాంతం. రాష్ట్ర అసెంబ్లీ కి కూడా ఎన్నికలు జరుగుతున్న సమయాల్లో ఈ సిద్ధాంతం మరింత బలంగా ప్రభావం చూపిస్తుంది. పోల్ పర్సెంటేజీ భారీగా నమోదు అయితే చాలు.. అధికార పార్టీ ఓడిపోతున్నట్టే అని జనరల్‌గా ఒక అంచనాకు వచ్చేస్తారు. ఆ కొలబద్ధల మీద చూసినప్పుడు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన భారీ పోల్ పర్సెంటేజీ కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గండమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2019 ఎన్నికల్లో ఏపీలో 79.8 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి స్పష్టమైన వ్యతిరేకతగానే అది నమోదు అయింది. తెలుగుదేశం ప్రభుత్వం పతనమైంది. 2024లో ఇప్పుడు పోల్ పర్సెంటేజీ 80 శాతం దాటనుంది. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పట్ల స్పష్టమైన వ్యతిరేకత వెల్లువెత్తినట్టుగానే భావించాలి. లేకపోతే ఇంత భారీస్థాయి పోలింగ్ నమోదు అయ్యేది కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున, ప్రభుత్వ సలహాదారు, సకలశాఖల మంత్రిగా ప్రత్యర్థులు పార్టీలోని వారు కూడా పిలుచుకునే సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ భారీ ఓటింగు గురించి చిత్రమైన భాష్యం చెప్పారు. స్వయంగా జర్నలిస్టు కూడా అయిన సజ్జలకు ఇలాంటి పోల్ పర్సెంటేజీలను బట్టి.. జనం నాడి ట్రెండ్ ఎలా ఉండవచ్చునో అంచనా వేయడం పెద్ద కష్టమైన టాస్క్ కాకపోవచ్చు.  కానీ ఆయన అధికార పార్టీకి ప్రధాన కార్యదర్శి కూడా కనుక, కఠినంగా కనిపిస్తున్న వాస్తవాలను అంగీకరించడానికి మనసురాలేదు. ఆయన ఏం చెప్పారంటే.. 2019లో భారీ పోలింగ్ శాతం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమేనట! కానీ 2024లో భారీ పర్సెంటేజీ అనేది మాత్రం ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా.. జగన్ ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలియజేయడానికి, సానుకూల ఓటు పడ్డదిట! వినేవాడు వెర్రి వెంగళాయి అయితే చెప్పేవాడు ఏమైనా చెప్పగలడని ఆయన నిరూపిస్తున్నారు.

పోల్ పర్సెంటేజీ పెరగడం అనేది టోటల్ గా చూసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అవుతుంది గానీ.. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్ గా పరిగణిస్తే ప్రతిచోటా ఇదే సిద్ధాంతం వర్తిస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం తమ తమ నియోజకవర్గాల్లో పర్సెంటేజీలను చూసుకుని, ఇతరత్రా తాము సేకరించిన పోలింగ్ సరళి సమాచారాన్ని బేరీజు వేసుకుని.. తాము నెగ్గుతామో లేదో అనే లెక్కల్లో మునిగి తేలుతున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories