వలంటీర్ల గుప్పిట్లో 2.5 లక్షల ఓట్లు!

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీసుకువస్తున్న కొన్ని కొత్త నిబంధనలు, కొత్త వెసులుబాట్లను కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ సొంత లాభం కోసం వాడుకుంటోంది. ఏపీలో ఏకంగా రెండున్నర లక్షల ఓట్లను డైరక్టుగా ప్రలోభపెట్టి, ప్రభావితం చేయడం ద్వారా.. తమ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా కుట్రలు పన్నుతోంది. సహజంగానే ఈసారి ఎన్నికలను పూర్తిగా దారి తప్పించడానికి వాడుతున్న వాలంటీర్లనే.. ఈ రెండున్నర లక్షల ఓట్లను హైజాక్ చేయడానికి కూడా ప్రయోగిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాగంటే..

రాష్ట్రంలో పోలింగ్ బూత్ కు రావడానికి ఇబ్బంది పడే, సౌకర్యంగా ఉండని వృద్ధులు, వికాలాంగులు తదితరులకోసం ఎన్నికల సంఘం కొంత వెసులుబాటు తీసుకువచ్చింది. ఈ వృద్ధులు పోలింగ్ కు ముందుగానే తమ అశక్తితను స్థానిక ఎన్నికల అధికారికి నిర్ణీత ఫారం ద్వారా తెలియజేసుకుంటే వారికి ఇంటినుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. ఈ వెసులుబాటు వృద్ధులకు వికలాంగులకు అనారోగ్యంతో ఉన్నవారికి వర్తిస్తుంది. అయితే.. ఈ ఏర్పాటును వైసీపీ వాడుకోవాలని చూస్తోంది. వీరందరూ కూడా పెన్షన్లు పొందుతున్న వర్గానికి చెందిన వారే కావడంతో.. ప్రతినెలా వారి ఇళ్లకు వెళ్లి పెన్షను అందిస్తున్న వాలంటీర్లను ప్రయోగించి..

వారు ఇంటిదగ్గర వేసే ఓటు తమ పార్టీకే పడేలా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఓట్లు రాష్ట్రంలో రెండున్నర లక్షల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఓట్లను దారిమళ్లించడం తీవ్రమైన కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్ల ద్వారా వ్యవస్థీకృతంగా ఈ కుట్ర నడుస్తోంది.

ఇంటినుంచి ఓటు వేయాలంటే.. ఫారం 12డీ దరఖాస్తును వారు ముందుగా సమర్పించాలి. ఈ ఫారం 12డీ దరఖాస్తులను వాలంటీర్లు వాళ్ల ఇళ్లకు తీసుకువెళ్లి సంతకాలు చేయించుకుంటున్నారు. వాటిని ఎన్నికల అధికారులకు పంపి.. ఎవరెవరు ఇంటినుంచి ఓటు వేయబోతున్నారో ఆ వివరాలను గుప్పిట పెట్టుకుంటున్నారు.

వారందరినీ టార్గెట్ చేసి ప్రభావితం చేయడానికి పూనుకుంటున్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించవచ్చునో అన్ని రకాలుగానూ దారితప్పిస్తున్నారని.. అధికార పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories