తమ మీద కేసులు నమోదు అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిగా కంగారు పడుతున్నారు. ఇన్నాళ్లు తామ ప్రదర్శించిన దురుసుతనాన్ని మనసులో పెట్టుకుని కక్ష కట్టి అధికార పార్టీ వారు ఏం చేస్తారో ఏమో అని అతిగా ఆందోళన చెందుతున్నారు. కేసు కట్టి విచారణకు పిలిచినంతనే తమను అరెస్టు చేసి శిక్షలు వేసినంతగా వారు భయపడుతుండడం గమనార్హం. కేవలం చేసిన తప్పుల తీవ్రతే వారిని భయపెడుతోంది తప్ప.. పోలీసులు వారి పట్ల వ్యవహరిస్తున్న సరళి మాత్రం కానే కాదు. ఇలాంటి పరిస్థితిలో లెక్కకు మిక్కిలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఒక్కరొక్కరుగా పరారీలోకి వెళుతుండగా తాజాగా ఒక్క నాయకుడు మాత్రం పోలీసు విచారణకు హాజరయ్యారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాపిరెడ్డిపల్లె హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసుల మీదకు ఉసిగొల్పిన కేసులో విచారణకు హాజరు కావడం గమనార్హం.
మామూలుగానే దురుసు వ్యాఖ్యలకు పేరు మోసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం అనుమతించిన హెలీపాడ్ వద్దకు కార్యకర్తలు ఎవరిని తరలించవద్దని పోలీసులు పదేపదే సూచించినప్పటికీ.. వైసీపీ నాయకులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆయన పట్టించుకోకుండా కావాలని కార్యకర్తలను అక్కడికే తరలించారు.
హెలిపాడ్ వద్ద కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలతో వారిని ఉసిగొలిపారు. కార్యకర్తలు పోలీసుల మీదకి రాళ్లురువ్వడం.. పోలీసులు గాయపడడం జరిగింది. ఈ వ్యవహారంపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా పరారీలో ఉన్న తోపుదుర్తి.. తాజాగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇప్పటిదాకా వైసీపీ తరఫున పరారీలో ఉన్న ఆరుగురు కీలక నాయకుల్లో విచారణకు హాజరైన మొదటి వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
ఇంకా మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి చాలా కాలం నుంచి పరారీలో ఉండగా.. లిక్కర్ స్కాంలో కీలక నిందితులు అయిన జగన్ సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ ఇంకా పరారీ లోనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు తెగ గాలిస్తున్నాయి. వారు చేజిక్కితే.. అంతిమ లబ్ధిదారుగా జగన్ పాత్ర గురించిన వివరాలు బయటకు వస్తాయని పోలీసులు అనుకుంటున్నారు.