తెలుగుదేశం జనసేన కూటమి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జడుసుకుంటున్నారా? కేవలం ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి, స్థిరత్వానికి కూడా దోహదం చేసే ఈ సూపర్ సిక్స్ ఆలోచనలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయంటే తన ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. సిద్ధం సభల వరుసలో చిట్టచివరిదిగా బాపట్ల జిల్లా మేదరమిట్ట వద్ద జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన చిట్టచివరి సభలో ఆయన మాటలే.. ఈ సూపర్ సిక్స్ హామీల పట్ల ఆయన భయాన్ని కూడా సూచిస్తున్నాయి.
మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు, ప్రతికుటుంబానికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, రూ.3వేల నిరుద్యోగ భృతి, 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి 20వేల ఆర్థిక సాయం.. ఇలా సామాజిక వికాసానికి తోడ్పడే హామీలను చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ గా ప్రకటించారు. ఆయన ప్రకటించిన నాటినుంచి.. ఈ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం శ్రేణులు గట్టిగానే శ్రమిస్తున్నాయి. వాటి ప్రయోజనాలను కూడా పద్ధతిగా వివరిస్తున్నాయి.
చూడబోతే.. ఈ సూపర్ సిక్స్ హామీలు తన ప్రభుత్వ పతనాన్ని నిర్దేశించబోతున్నాయని జగన్మోహన్ రెడ్డికి అర్థమైనట్టుగా కనిపిస్తోంది. ఈ హామీల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని గుర్తించినట్లుగా.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శకునాలు పలుకుతున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు చెప్పిన హామీలు అమలు కావడం సాధ్యం కాదని ఆయన జోస్యం చెబుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు చేయాలంటే.. ఏడాదికి 73 వేల కోట్ల రూపాయలు కావాలట. చంద్రబాబు చెబుతున్న మొత్తం హామీల విలువ ఇప్పటికే 1.5 లక్షల కోట్ల రూపాయల మార్క్ దాటిపోయిందిట. అబద్ధపు హామీలతో, మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారంటూ జగన్ విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబునాయుడు తొలినుంచి కూడా ప్రభుత్వం అంటే కేవలం డబ్బు పంచిపెట్టడం మాత్రమే కాదు.. సంపద సృష్టించడం కూడా అని అంటూనే ఉన్నారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని కూడా అంటున్నారు. పథకాల అమలకు అవసరమైన సంపద సృష్టి ఎలాగో మార్గాలు తెలుసుగనుకనే ఆయన హామీలు ఇవ్వగలిగారు. ఆ విషయంలో చంద్రబాబునాయుడు సామర్త్యాన్ని ప్రజలు నమ్ముతున్నారు. పథకాలు కొనసాగించడం అంటే.. కేవలం అప్పులు తెచ్చి వాటిని నడపడం మాత్రమే తెలిసిన జగన్మోహన్ రెడ్డికి, ప్రతినెలా పథకాలకోసం అప్పులు తేలేక సతమతం అయిపోతున్న జగన్మోహన్ రెడ్డికి సంపదసృష్టి అంటే అర్థం కాకపోవచ్చు. అందుకే చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ హామీలు అమలు కాబోవని ఆయన ముందు నుంచి చెబుతున్నారు. ఈ భయమే ఆయనకు ఎదురుకాబోయే పరాజయానికి సంకేతం అని విశ్లేషకులు అంటున్నారు.