సజ్జల ట్రైనింగ్ లక్ష్యం విధ్వంసమేనా?

‘రూల్స్ పాటించే వారు మాకు అవసరం లేదు.. కౌంటింగ్ కేంద్రంలో ఏం జరిగినా సరే.. చివరివరకు ఉండి పోరాడే వారే మాకు కావాలి.. రూల్సు ఉల్లంఘించినా పర్వాలేదు..’ అని బాహాటంగా ప్రకటించడం ద్వారా.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.. తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ నాడు కోసం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నదో తేల్చి చెప్పేశారు. తాజాగా ఆదివారం కౌంటింగ్ ఏజంట్లకు ఆయన శిక్షణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈ శిక్షణ పూర్తిగా కౌంటింగ్ విధివిధానాల గురించి కాదని, ఆ రోజున ఎలాంటి విధ్వంసాలు సృష్టించాలా అనే దాన్ని గురించేనని అనేక అనుమానాలు ప్రజల్లో మొదలవుతున్నాయి.
పోలింగు నాడు తమ శక్తిమేరకు భారీ విధ్వంసం సృష్టించడం, శాంతి భద్రతలు అదుపు తప్పేలా చేయాలని అధికార పార్టీ వ్యూహరచన చేసినట్టుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఓటర్లను భయపెట్టేలా పోలింగ్ కేంద్రాల వద్ద వాతావరణాన్ని చెడగొడితే.. తమ ప్రత్యర్థికి ఓట్లు వేసేవారెవ్వరూ పోలింగ్ కేంద్రాలకే రారు అనేది అప్పటికి వారి వ్యూహంగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అయితే వారి పాచిక పారలేదు. చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం వారు దీటుగా అడ్డుకున్నారు. ఘర్షణలు రేగాయి.చాలా వరకు ఎన్నికల సంఘం కూడా ఇలాంటి అరాచకాలను ముందుగానే ఊహించి.. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం, అంచెలవారీగా పోలీసులను మోహరించడం చేయడం వల్ల.. వైసీపీ వారు అనుకున్నట్టుగా జరగలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద కొన్నిచోట్ల పెట్రో బాంబులు విసిరి చేయదలచుకున్న బీభత్సం సాధ్యం కాలేదు. పోలింగ్ చాలా పెద్దస్థాయిలో జరిగింది.
పోలింగ్ నాడు పాచిక పారకుండా పోయేసరికి.. ఇప్పుడికే చేసేదేమీ లేకపోయినప్పటికీ కౌంటింగ్ నాడు కూడా అదే వ్యూహం అనుసరించాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.
రూల్సు ఫాలో అయ్యే వాళ్లు వద్దని అనడమే.. కౌంటింగ్ ఏజంట్లుగా వెళ్లే వైసీపీ కార్యకర్తలను సామూహికంగా రెచ్చగొట్టే కార్యక్రమం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మాట అన్నందుకు సజ్జల మీద పోలీసు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సజ్జల ఆధ్వర్యంలో శిక్షణ అంటే అది విధ్వంసానికి తర్ఫీదు ఇవ్వడమే అని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories