శెభాష్.. నారా లోకేష్ అందరికీ ఆదర్శం కావాలి!

ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పెద్ద విశేషమేమీ కాదు. అలాంటివి జరిగినప్పుడు అక్కడి ప్రధానోపాధ్యాయుల్ని, టీచర్లను అందరూ ప్రశంసించడమూ, ఎవరు ఎక్కువ కృషిచేసి ఉంటే వారిని గుర్తించి సత్కరించడమూ కూడా వింత కాదు. సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులు అందజేసే క్రమంలో ఇలాంటి విజయాలన్నీ కూడా నమోదు అవుతూ ఉంటాయి. అయితే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక గొప్ప పని చేశారు. రాబోయే సెప్టెంబరు 5న గురుపూజోత్సవం నాడు ఒక మెమెంటో ఇవ్వడానికి వీలుగా అవార్డులు ప్రకటించే జాబితాలో పెట్టలేదు. ప్రత్యేకంగా తన నివాసానికి పిలిపించుకుని ఘనంగా సత్కరించారు. అంతే కాదు.. విద్యావ్యవస్థను మరింత మెరుగ్గా చేయడానికి, విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలవైపే మొగ్గేలా చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలో.. సలహాలు కూడా స్వీకరించారు. ఒక సాధారణ హెడ్మాస్టరు నుంచి విద్యాశాఖ మంత్రి వ్యక్తిగతంగా సలహాలు స్వీకరించడం నిజంగానే గొప్ప విషయం. అందరు మంత్రులు కూడా ఈ రకమైన పనితీరును ఆదర్శంగా తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

కృష్ణాజిల్లా పెనమలూరు లో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని ని నారా లోకేష్ ప్రత్యేకంగా తన ఉండవిల్లి నివాసానికి పిలిపించుకున్నారు. ఆమను ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. రాబోయే నాలుగేళ్లలో ప్రెవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగాలంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీట్లు ఖాళీ లేవు’ అనే బోర్డులు పెట్టాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆమెనుంచి సలహాలను కూడా స్వీకరించారు.

సాధారణంగా మంత్రి స్థాయికి చేరుకున్న తరువాత.. ‘తాము సర్వజ్ఞులం’ అనే అహంకారం చాలా మందికి వస్తుంది. తాము ఏం తలిస్తే అదే ఆ రంగానికి మేలు చేస్తుందని, ఆ రంగం బాగుపడాలంటే తమ ఆలోచనలు అమలైతే చాలునని అనుకుంటూ ఉంటారు. అలాంటిదేమీ లేకుండా.. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రధానోపాధ్యాయురాలినుంచి సలహాలు స్వీకరించడం అనేది చాలా అభినందనీయమైన విషయం. లోకేష్ తరహాలోనే తతిమ్మా అందరు మంత్రులు కూడా.. తమ తమ శాఖలకు సంబంధించి.. క్షేత్రస్థాయిలోని వారిని తరచూ కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటే.. ఆయా శాఖలు మరింతగా ప్రజాసేవ చేయడం వీలవుతుంది.

దుర్గాభవానికి సత్కారం చేసిన తర్వాత.. లోకేష్ ఈ విధంగా ట్వీట్ చేశారు: ‘‘తన నిబద్ధతతో కృష్ణా జిల్లా పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవాని గారిని ‘షైనింగ్ టీచర్’  పేరుతో ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించాను. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి తద్వారా ప్రవేశాలు పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు స్కూల్స్ అడ్మిషన్లు తగ్గాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డులు ఉండాలనేదే మా లక్ష్యం. ఇందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ సందర్భంగా వివరించాను. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం దుర్గా భవాని గారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాను.’’
నారాలోకేష్ అనుసరించిన ఈ మార్గాన్ని ఎందరు మంత్రులు ఆదర్శంగా తీసుకుంటారో వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories