వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతటి అసహనంలో బతుకుతున్నారో.. ఏ స్థాయిలో భయాందోళనల మధ్య గడుపుతున్నారో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. ఒకరు మరొక వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటున్నారంటే.. దొంగచాటుగా వారికి నష్టం కలిగించాలని చూస్తున్నారంటే, వారిని నాశనం చేయాలని చూస్తున్నారంటే.. వారిని చూసి అసూయపడుతున్నట్టే లెక్క. పరోక్షంగా వారిని చూసి భయపడుతున్నట్టే లెక్క. ఇప్పుడు పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అదే తీరు కనిపిస్తోంది. అక్కడ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ప్రవర్తిస్తున్న తీరు.. వారి పట్ల ప్రజల్లో ఏవగింపును కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ జెండాలను తగులబెట్టడం, తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సిలను తగులబెట్టడం వంటి చర్యల ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు శాడిస్టిక్ ఆనందాన్ని పొందగలరే తప్ప.. అందువల్ల ప్రజాదరణ పొందలేరు కదా.. విజయాన్ని సాధించినట్టు కాదు కదా.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
పులివెందుల అనేది.. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నియోజకవర్గమే కావొచ్చు గాక. ఆ రాజశేఖర రెడ్డికి కొడుకు కాబట్టి.. వైఎస్ జగన్ ను కూడా ప్రతిసారీ గెలిపిస్తూ ఉండే నియోజకవర్గం కావొచ్చు గాక. అంతమాత్రాన అది తమకు పెట్టని కోట అని, మరో పార్టీకి అక్కడ స్థానం ఉండనివ్వమని వారు భావిస్తే గనుక.. తప్పులో కాలేసినట్టే. ఆ సంగతి గ్రహించకుండా నియోజకవర్గంలో వైసీపీ దళాలు అరాచకత్వానికి పాల్పడుతున్నాయి. మరో పార్టీకి అస్తిత్వమే లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా దుర్మార్గం చేస్తున్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తెలుగుదేశం ఫ్లెక్సిలను ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఎన్నికల సమయంలో.. ఇలాంటివి మామూలే. అయితే రోడ్డు పక్కన కట్టిన తెలుగుదేశం ఫ్లెక్సిలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టేశారు. తెదేపా నేత బీటెక్ రవి, అభ్యర్థి లతారెడ్డి సహా తెలుగుదేశం నాయకుల ఫోటోలతో ఫ్లెక్సిలు వేశారు. ఈ ఫ్లెక్సిలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు.
ఆ మార్గాల్లో సీసీ కెమెరాలు ఉండవు గనుక.. తాము ఎలా తగులబెట్టినా, ఏం తగులబెట్టినా.. తమను అనుమానించి అరెస్టు చేసే అవకాశం ఉండదని వారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉండవచ్చు. రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక పార్టీకి చెందిన వారు పాల్పడే దుర్మార్గాలు.. చేసే తప్పులు.. చట్టం ముందు నిరూపణ కావడమూ, వారికి శిక్ష పడడమూ అనేది చాలా చిన్న సంగతి. వారికి, చట్టం ఏర్పాటు చేసినదానికంటె ప్రజల కోర్టు చాలా పెద్దది. ప్రజల వారి పాపాలను చట్టాలతో తూకం వేయరు, సాక్ష్యాధారాలను అడగరు. వారి ఆగడాలకు సంబంధించి.. తమ విచక్షణతో నిర్ణయం తీసుకుని తీర్పు చెబుతారు. అలాంటి తీర్పు వచ్చినప్పుడు 2024 ఎన్నికల్లో ఎదురైన వినాశనం వంటిదే మళ్లీ పలకరిస్తుంది.