వారిని వదులుకోవడం జగన్ అహంకార ప్రతీక!

ఎన్నికల సమయంలో, ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక సమయంలో పార్టీల అధినేతల మీద ఎంతో ఒత్తిడి ఉంటుంది. అంతటి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునేప్పుడు ఏవో కొన్ని పొరబాట్లు ఖచ్చితంగా దొర్లుతాయి. ఆ పొరబాట్లకు చెల్లించవలసి వచ్చే మూల్యం ఎంత అనేది నిదానంగా తేలుతుంది. ఒత్తిడిలో జరిగే పొరబాట్లు ఓకే.. కానీ కేవలం అహంభావంతో, అహంకారంతో తీసుకునే నిర్ణయాలు తప్పుడువి అయితే పరిస్థితి ఏమిటి? బాధ్యత ఎవరిది? పార్టీకి చేటు చేసే నిర్ణయం అని అందరూ చెవినిల్లు కట్టుకుని పోరినా కూడా పట్టించుకోకుండా.. కేవలం తన అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం.. తాను తలచిందే చేసుకుంటూ పోతే దాని వలన జరిగే నష్టానికి కూడా ఆ అధినేతే బాధ్యత వహించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి వలన జరుగుతున్న పరిణామాలు ఇలాంటి భావనను కలిగిస్తున్నాయి.
కొందరు నాయకుల విషయంలో జగన్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే.. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఆయన వదిలేసుకున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఆయనను పొమ్మనకుండా పొగబెట్టారని అనవచ్చు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజల్లో చాలా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్న మాగుంట కుటుంబాన్ని వదిలించుకోవడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే చేస్తుందని సొంత పార్టీలోనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండే నాయకుడు. పైగా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎవరు వచ్చి సాయం అడిగినా చేసేవాళ్లుగా వారి కుటుంబానికి పేరుంది. ఆయన తప్పకుండా మళ్లీ గెలుస్తారనే విశ్వాసమూ అధికారపార్టీలోనే ఉంది. అందుకోసమే.. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాగుంట కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని అడిగారు. ఇవ్వకపోతే తాను ఎమ్మెల్యేగా కూడా పోటీచేయను అని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఏం చేసినా సరే.. జగన్ పట్టించుకోలేదు. మాగుంట కుటుంబానికి టికెట్ ఇచ్చేది లేదని అనేశారు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విషయంలో కూడా ఇలాంటి మొండి వైఖరినే జగన్ అనుసరించారు. నరసరావుపేట పరిధిలో ఎంతో మంచిగా పనిచేస్తూ వచ్చిన లావు ను గుంటూరునుంచి పోటీచేయాలని అన్నారు. పేట పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ.. లావుకే ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ వద్ద మొరపెట్టుకున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఎంపీగా ఆయన లేకపోతే తమ గెలుపుమీద కూడా ప్రభావం పడుతుందని కూడా వారు చెప్పుకున్నారు. వినలేదు. తీరా అలిగి, లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే తరహాలో మాగుంటను కూడా జగన్ స్వయంగా తెలుగుదేశంలోకి పంపుతున్నారు. ఇలాంటి ప్రజల్లో మంచి పేరున్న నాయకుల్ని వదులుకోవడం వైసీపీకి మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories