మంత్రి గుడివాడ అమర్నాధ్.. జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాద్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తూ తెలుగుదేశాన్ని, ప్రధానంగా పవన్ కల్యాణ్ ని తీవ్రాతితీవ్రంగా తిట్టిపోస్తూ పనిచేసినందుకు.. ఆయనకు ప్రతిఫలం లభించింది. ఇన్నాళ్లూ అసలు ఎమ్మెల్యే టికెట్ గుడివాడకు దక్కుతుందో లేదో అనే భయం ఆయన అభిమానుల్లో ఉండేది. ప్రస్తుతం గుడివాడ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి ఆయన పేరును ప్రకటించకపోవడం.. వరుసగా అనేక జాబితాలు వచ్చినా ఆయన పేరు ఎందులోనూ లేకపోవడం చూస్తోంటే.. పాపం గుడివాడకు ఇప్పుడు దక్కినదే ఆఖరు పదవి అవుతుందేమో అనే అభిప్రాయం కూడా పలువురికి కలిగింది. ఒక దశలో గుడివాడ అమర్నాధ్ కు కూడా టికెట్ దక్కుతుందనే నమ్మకం పోయింది.
అయితే ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు దయతలిచారు. గుడివాడకు ఒక సీటు విదిలించారు. కానీ.. ఈ కేటాయింపులో కూడా ఇండైరక్టుగా ఆయన చీటీ చించేసినట్టేనని, చూడడానికి సిటింగ్ ఎమ్మెల్యే సీటే.. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సీటే గానీ.. మళ్లీ గెలుపు దక్కించుకోగల సీటు మాత్రం కాదని పలువురు అంటున్నారు. అలాంటిదానిని ఏరి మరీ గుడివాడకు కేటాయించినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. అందులో గుడివాడ అమర్నాధ్ ను గాజువాక నియోజకవర్గానికి కేటాయించారు.
కాగితం మీద చూసినప్పుడు గాజువాక వైసీపీ సీటే కదా అనిపిస్తుంది. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీనే గెలిచింది. మామూలు విజయం కాదు. జనసేనాని పవన్ కల్యాణ్ ను వైసీపీకి చెందిన తిప్పల నాగిరెడ్డి ఏకంగా పాతికవేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించారు. కాబట్టి అది ఢంకాపధంగా వైసీపీ సీటే అనిపిస్తుంది.
అయితే వైసీపీలో ఆ నియోజకవర్గంలో ఓడిపోతాం అనే భయం ఇప్పుడు ఉంది. అయితే ఆ ఓటమి భయానికి గల కారణాల్ని సిటింగ్ ఎమ్మెల్యే మీద నెట్టేశారు జగన్! పవన్ ను అంత మెజారిటీతో ఓడించిన తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టేశారు. చాలా మీమాంస తర్వాత అనకాపల్లికి పనికి రాకుండాపోయాడని అనిపించిన, గత ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ఆదరణని దూరం చేసుకున్నాడని అనిపించిన గుడివాడ అమర్నాధ్ ను అక్కడకు తీసుకువెళుతున్నారు. అక్కడ తిప్పల నాగిరెడ్డి వర్గం ఈ నిర్ణయంపై ఆగ్రహంగా ఉంది. పార్టీకి సహకరించే ఉద్దేశంతో లేరు.
పైగా ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం లలో ఓడిపోయాక జనసేన ఆ నియోజకవర్గాలపై చాపకింద నీరులా పైకి కనిపించకుండా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఆ చోట్లనుంచి పవన్ బరిలో దిగకపోవచ్చు గానీ.. ఆ రెండు స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. పైగా ఇప్పుడు పవన్ కల్యాణ్ దళానికి లడ్డూలాగా.. ఇన్నాళ్లూ ఆయనను తెగవిమర్శిస్తూ వచ్చిన గుడివాడ అమర్నాధ్ దొరికారు. ఇక ఆయనను గెలవనివ్వరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. గుడివాడ అమర్నాధ్ ను తొలుత యలమంచిలికి మారుస్తారని అనుకున్నప్పటికీ.. గాజువాకకు పంపడం ద్వారా జగన్ ఆయన చీటీ చించేసినట్టే అని జోకులు వినిపిస్తున్నాయి.
ReplyForwardAdd reaction |