ఇద్దరు కలిసి ప్రయాణం ప్రారంభించాలని అనుకున్న తరువాత.. కొన్ని సర్దుబాట్లు ఉభయులకూ తప్పనిసరి. ఏ ఒక్కరు మొండిపట్టు పడుతూ ఉన్నా వ్యవహారం బెడిసికొడుతుంది. అంతా గందరగోళం అవుతుంది. ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వరాదనే సంకల్పంతో.. తెలుగుదేశం- జనసేన- బిజెపి కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని పట్టువిడుపులు పాటిస్తుండడం శుభపరిణామంగా కనిపిస్తోంది. మిత్రబంధానికి చేటు రాకుండా వారు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. జనసేన పార్టీ తరఫున ఆరో అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించడం మంచి పరిణామం అని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఆశించారు. కాస్త దూకుడు ప్రదర్శించి.. చాలా కాలం కిందటే.. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయబోయేది నేనే అని కూడా ప్రకటించేసుకున్నారు. అయితే.. గత ఎన్నికల సమయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెగ్గారు. అప్పట్లో జగన్ ‘ఒక్క చాన్స్’ విజ్ఞప్తి, వేడుకోలు రాష్ట్రమంతా పనిచేసిన సమయంలో కూడా తెలుగుదేశం నెగ్గిన స్థానాల్లో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి.
అలాంటిది, తెలుగుదేశానికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటును జనసేన ఆశించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దుర్గేష్ తీరు మీద మండిపడ్డారు. పొత్తులు, సీట్ల పంపకాలు తేలకుండానే.. తనకు తానుగా ఆయన సీటు ఎలా ప్రకటించుకుంటారని ఆగ్రహించారు. అయితే.. ఇలాంటి మనస్పర్ధలకు తెరదించేస్తూ… పవన్ కల్యాణ్ కాస్త పట్టువిడుపు ప్రదర్శించారు. కందుల దుర్గేష్ కు సర్దిచెప్పి ఆయన నియోజకవర్గం మార్చారు. నిడదవోలు నుంచి బరిలోకి దించుతున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటించింది. కందుల దుర్గేష్ కూడా.. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యం అని మీడియాకు వెల్లడించడం గమనార్హం.
ఇలాంటి సర్దుబాట్లు కూటమి పార్టీలకు ఎంతో మేలు చేస్తాయి. తొలిదశలో నాయకుల స్థాయిలోనే సీట్ల సర్దబాట్లు అవసరం. ఆ తర్వాతి దశలో ఆయా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకుల, కార్యకర్తల సమన్వయంను వారు సాధించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా సవ్యంగా జరిగితే.. ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి విజయదుందుభి మోగిస్తుంది.