నైతికత ఉంటే సోము, విష్ణు దూరంగా ఉండాలి!

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తులు కుదిరాయి. 2014 లో ఏ మాయాజాలం ప్రదర్శించి ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయో.. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ కానుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వరాదని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించాలని పవన్ కల్యాణ్ సంకల్పం, కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం కాదని చంద్రబాబునాయుడు దూరాలోచన కలిసి బిజెపితో పొత్తులకు వారిని ప్రేరేపించాయి. ఈసారి ఎన్డీయే తరఫున జాతీయ స్థాయిలో 400 పైచిలుకు సీట్లు సాధించి ఘనంగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న మోడీదళం కూడా అందుకు ఓకే అనడంతో పొత్తులు కుదిరాయి. ఏపీలో జగన్ పాలనకు భరతవాక్యం పలకాలని ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ పొత్తులు పెద్ద శుభ సంకేతంగా కనిపిస్తున్నాయి. 
అయితే ఈ మూడు పార్టీల పొత్తులు కుదరకుండా ఉండేందుకు తమ శతవిధాల ప్రయత్నించిన శక్తులు కొన్ని ఉన్నాయి.

ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవకూడదని వారు కోరుకున్నారు. అందుకు అనుకూలంగా పార్టీలో తమకు ఉన్న పాబల్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించారు. అలాంటి వారిలో ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి తదితరులు ముందువరుసలో ఉంటారు. తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకోవడం అనేది వీరికి ఇష్టం లేదు. అందుకు రకరకాల సాకులు చెబుతూ వచ్చారు. సొంతంగా పోటీచేస్తే.. పార్టీ చాలా బలపడుతుందని.. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తామే సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తుందని ఇలా అనేక మాయమాటలు ప్రయోగించారు. 
సోము వీర్రాజు లాంటివాళ్లు పార్టీ జాతీయ కమిటీలో తమకు ఉన్న హోదాలను పురస్కరించుకుని ఏపీ ప్రజలను తప్పుదారి పట్టించడానికి కూడా ప్రయత్నించారు. ఏపీలో బిజెపి 175 ఎమ్మెల్యే స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పూర్తిగా ఒంటరిగానే పోటీచేయబోతున్నదని, ఈ మేరకు అధిష్ఠానం పెద్దల నుంచి తనకు స్పష్టమైన సమాచారం ఉన్నదని ఆయన ప్రకటనలు చేశారు. తద్వారా పొత్తు ఉంటే బెటర్ అనుకుంటున్న ఏపీ బిజెపి నాయకుల్లో అయోమయం సృష్టించడానికి కూడా ఆయన ప్రయత్నించారు. 

ఇలాంటి నాయకులకు కనీస నైతిక విలువలు ఉంటే.. ఇప్పుడు పొత్తు కుదిరిన ఎన్నికల్లో పోటీచేయకుండా దూరంగా ఉండాలని కమలదళం నేతలు భావిస్తున్నారు. సోము వీర్రాజు ఎంపీగా పోటీచేయాలని కోరుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్నటిదాకా పొత్తులను ఛీత్కరించిన నేత, ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెలుగుదేశం జెండాలు పట్టుకుని వారి ఓట్లమీద ఎంపీగా నెగ్గడానికి ఎలా సిద్ధపడతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి పొత్తులను వ్యతిరేకించిన కమలనేతలు తమ నైతికతను ఎలా నిరూపించుకుంటారో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories