జగన్ సర్కార్ అరాచకత్వానికి చెంపపెట్టు

కేవలం రాజకీయ నిర్ణయాలు, విధ్వంసమే పరమావధిగా పాలన సాగించడం మాత్రమే కాదు.. సంక్షేమ పథకాల ముసుగులో అయిన వారికి పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడం మాత్రమే కాదు! కీలకమైన ఉద్యోగ నియామకాల్లో కూడా అరాచకత్వంతో వ్యవహరించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రూప్ 1  ఉద్యోగ నియామకాలను చెల్లవంటూ కొట్టి పారేసింది. అసలు గ్రూప్ 1 నోటిఫికేషనే చెల్లకుండా పోతుందని హైకోర్టు తీర్పు చెప్పింది.


ఇంతకూ ఏం జరిగిందంటే..


2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గ్రూప్ 1కు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు. నియామకాలు కూడా పూర్తయ్యాయి. సెలక్టయిన వారు ఇప్పుడు విధుల్లో ఉన్నారు. అయితే గ్రూప్ 1 ప్రశ్నపత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేశారని, అందువల్ల తొలుత ఓఎంఆర్ ను మూల్యాంకనం చేసినప్పుడు వచ్చిన ఫలితాలు పూర్తిగా మారిపోయాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును క్షుణ్నంగా విచారించిన న్యాయస్థానం .. పరీక్ష పేపర్లను రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయడం అనేది చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఉద్యోగాల్లో ఉన్నవారినందరినీ వెనక్కు పంపి.. తాజాగా గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం ఎంపిక ప్రక్రియ అన్నీ కలిపి 6 వారాల్లోగా పూర్తిచేయాలని కూడా కోర్టు చెప్పింది.


ఇది జగన్ ప్రభుత్వానికి హైకోర్టునుంచి తగిలిన గట్టి దెబ్బ  అనుకోవాలి. జగన్ సర్కారు తీసుకుంటున్న అనేక ప్రజావ్యతిరేక చట్ట వ్యతిరేక నిర్ణయాలు హైకోర్టు ఎదుట చాలా సందర్భాల్లో వీగిపోతూ వస్తున్నాయి. తమ దుందుడుకు నిర్ణయాలు బెడిసికొట్టిన ప్రతిసారీ.. తెలుగుదేశం మీద వారు నిందలు వేస్తుంటారు. తెదేపా వారే కోర్టుకు వెళ్లి.. తాము ప్రజలకు మంచి చేయాలనుకుంటే అడ్డుపడుతున్నారని ఆడిపోసుకుంటూ గడిపేస్తున్నారు.
అయితే గ్రూప్ 1 వివాదం వేరు. ఇందులో నష్టపోయిన అభ్యర్థులే  కోర్టుకు వెళ్లారు. జగన్ సర్కారు గ్రూప్ 1 ల ఎంపికలో చేసిన అరాచకాలు అన్నీ బయటకు వచ్చాయి. కోర్టు బ్రేకు వేసింది.


అదే సమయంలో.. జగన్ సర్కారు ఏకంగా గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన 49వేల ఓఎంఆర్ షీట్లను మార్చేసిందని, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి అరాచకంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిరుద్యోగులను నిండా ముంచిందని అంటున్నారు. జగన్ సర్కారు ఉద్యోగాల భర్తీ ఏమాత్రం చేపట్టకపోగా.. చంద్రబాబు సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా నీరుగారిపోయేలా అరాచకాలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories