జగన్ ముద్దుపేర్లు చెప్పేసిన ప్రియమైన చెల్లెలు!

ప్రియమైన వాళ్లకు మనం కూడా బిరుదులు ఇచ్చుకుంటూ ఉంటాం. లేదా మనకు ప్రియమైన వారిని ముద్దుపేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్లనైతే అంటే బిడ్డల్ని, అన్నల్ని, చెల్లెళ్లని ఇంకా ప్రేమతో ముద్దుపేర్లతోనే వ్యవహరిస్తూ ఉంటాం. మరి మన ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి ముద్దుపేర్లు ఏవో ఉండే ఉంటాయి కదా. ఆ ముద్దుపేర్లు ఏమిటో చెప్పగలిగిన వాళ్లు ఆయన చెల్లెలి కంటె బెటర్ గా ఎవరుంటారు? ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల జగన్ ముద్దుపేర్లను బయటపెట్టేశారు. జగన్ అంటే ‘‘420, కేడీ’’ అని షర్మిల అన్నారు. ప్రజల్ని మోసగించిన వారిని ఇంతకంటె మరోలా ఎలా అనగలం అని కూడా షర్మిల తాను, అన్నయ్యకు పెట్టిన ముద్దుపేర్లను సమర్థించుకున్నారు. 

జగన్ విజయానికి 2019 ఎన్నికల్లో తీవ్రంగా పరిశ్రమించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దూరం పెట్టడంతో విభేదాలు పెంచుకున్న షర్మిల తొలుత తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించి కొన్నాళ్లు కష్టపడ్డారు. తర్వాత పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి.. ఏపీలో పీసీసీ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. ఆనాటినుంచి జగన్ పాలనలోని వైఫల్యాల గురించి.. జగన్ మాట తప్పిన తీరుల గురించి నిశిత విమర్శలతో ఆమె విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 
ప్రత్యేకించి.. ఏపీకి ప్రత్యేకహోదా సాధించే విషయంలో జగన్ ఎలా మాట తప్పారో, ఏ రకంగా తెలుగు ప్రజలను మోసం చేశారో.. ఎలా మోడీ ఎదుట సాగిలపడ్డారో షర్మిల చాలా విపులంగా ప్రజలకు చెబుతున్నారు. ఆ క్రమంలో భాగంగా ప్రత్యేకహోదా సాధన కోసం తిరుపతిలో ఓ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించిన షర్మిల జగన్ హోదా విషయంలో మడమ తిప్పడం గురించి తూర్పార పట్టారు. 

తాజాగా ఆమె భాజపాను, జగన్ ను కలిపి తీవ్రంగా విమర్శించడం విశేషం. ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినప్పటికీ బిజెపి ఏపీ వ్యవహారాలను శాసిస్తున్నదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి , ఆయన పార్టీలోని పెద్దలు బిజెపికి బానిసలుగా మారిపోయారని విమర్శిస్తున్న ఆమె, అంతటితో ఆగకుండా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా బిజెపికి బానిసలను చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించడం గమనార్హం. భాజపాతో అక్రమ పొత్తు కలిగిఉన్నందునే మణిపూర్ లో క్రైస్తవులపై విచ్చలవిడిగా దాడులు జరిగితే జగన్ చూస్తూ మిన్నకుండిపోయారని అనడం ద్వారా.. జగన్ కు బలం ఉన్న క్రైస్తవవర్గంలో కూడా కొత్త ఆలోచన రేకెత్తించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories