గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ ఒక డైలాగు చెబుతారు- ‘‘ఒకమ్మాయి వారానికి పడుద్ది.. ఒకటి నెలకు పడుద్ది.. ఇంకోటి సంవత్సరానికి పడుద్ది.. అమ్మాయన్నాక అది పడే తీరాల్రా’’ అని! ఈ థియరీ అప్పటికి కామెడీగా అనిపించి ఉండొచ్చు. మనుషుల్ని లొంగదీసుకోవడంలో ఒక్కోడూ ఒక్కో రేటు వద్ద పడిపోతాడని, లేదా ఒక్కొక్కడూ ఒక్కో పద్ధతికి పడిపోతాడని.. కొందరు పెద్దవాళ్లకు అభిప్రాయాలు ఉండవచ్చు. అందుకే మనుషుల్ని లొంగదీసుకునే విషయంలో సామదానభేద దండోపాయాలనే మాట కూడా వాడారు. సామ- ఉపాయం అంటే మామూలుగా మాటలతో చెప్పిచూడడం, దాన- ఉపాయమంటే ప్రలోభపెట్టి, గిఫ్టులు నగదు ఆఫర్ చేసి లొంగదీసుకోవడం, భేదోపాయమంటే.. విభేదించి బెదిరించి లొంగదీసుకోవడం, దండోపాయం అంటే కొట్టి లొంగదీసుకోవడం అన్నమాట.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రియమైన తమ్ముడు- బాబాయిని హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఈ నాలుగు ఉపాయాల మీద చాలా నమ్మకం ఉంది. తాము ఎలాంటి వారినైనా ఏదో ఒక పద్ధతిలో లొంగదీసుకోగలం అని వారికి నమ్మకం. అయితే వీటికి లొంగకుండా, కొరుకుడుపడకుండా దస్తగిరి ఈ అన్నాతమ్ముళ్ల వ్యవహారసరళికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కు అప్రూవర్ గా మారి.. హత్య చేసినదెవరనే సంగతి, ఎలా చేశారనే సంగతి విపులంగా చెప్పేసిన దస్తగిరి, ఆ హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా వారితో అన్నారు. అప్పటినుంచే అవినాష్ చుట్టూ కేసు బాగా బిగుసుకుంది. అప్పటినుంచే.. దస్తగిరిని లొంగదీసుకోవడానికి జగన్ అవినాష్ ద్వయం కష్టపడడం క కూడా జరుగుతోంది.
దస్తగిరిని మాటలతో బెదిరించి చూశారు. వేరే కేసులో అతను కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు.. నేరుగా అక్కడకు 20 కోట్ల రూపాయల ముడుపుల ఆఫర్ కూడా తీసుకువెళ్లారు. విభేదించారు.. అన్నీ అయ్యాయి.. ఇప్పుడు దండోపాయం- దాడులకు దిగుతున్నారు. తాజాగా ఆటో తోలుకుని బతికే దస్తగిరి తండ్రి మీద ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడిచేసి గాయపరచడం సంచలనం అవుతోంది.
అయినా సరే దస్తగిరి మాత్రం లొంగడం లేదు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఆల్రెడీ ప్రకటించిన దస్తగిరి.. ఇలాంటి దాడులతో తనను ఎన్నికల నుంచి తప్పించలేరని అంటున్నారు. తాను పోటీచేస్తానంటే, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యక్ష దాడులు, హత్యాప్రయత్నాల్లాంటివి జరుగుతున్నప్పటికీ.. దస్తగిరికి గానీ, అవినాష్ రెడ్డి నుంచి ప్రమాదం పొంచి ఉన్న అతని కుటుంబానికి గానీ రక్షణ కల్పించడం గురించి ప్రభుత్వం, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది.