మాయమాటలతో విశాఖ వాసులను మభ్యపెట్టవచ్చుననుున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలకు కాలం చెల్లినట్టు నిరూపణ అయింది. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థిరంగా నడపగల శక్తిగానీ, మళ్లీ అధికారంలోకి తీసుకురాగల చేవగానీ జగన్ కు లేవని ఆయన పార్టీ వారే భయపడుతున్నట్టుగా కొత్త నిదర్శనం ఇది. విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ పూర్తిగా కూటమి వశం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ హరివెంకటకుమారి మీద కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రత్యేకసమావేశంలో నెగ్గింది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే సమావేశం జరగాలంటే.. 74 మంది సభ్యుల హాజరు ఉండడం కోరం అవుతుంది. అంతమంది సభ్యులు హాజరు కావడంతో సమావేశం జరిగింది. అందరూ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. విశాఖ కార్పొరేషన్ కూటమి పరం అయింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం సన్నగిల్లుతూ అనేక మంది నాయకులు ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా తమ తమ పదవులను కూడా వదులుకుంటూ.. పార్టీని వీడిపోతున్నారు. వారిలో ఒక్కరితోనైనా మాట్లాడడానికి, పార్టీలోనే ఉండేలా ఒప్పించడానికి ఆయన ప్రయత్నింంచింది లేదు. అదే సమయంలో మునిసిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు పార్టీని వీడిపోతోంటే మాత్రం.. ఆయన ఓర్వలేకపోయారు. తన నాయకుల్ని అదేపనిగా పురమాయించారు. కార్పొరేటర్లు పార్టీని వీడకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయాలని చూశారు. ఒకదశలో వైసీపీ ఒత్తిళ్లకు ఆ పార్టీ వారే భయపడిపోయారంటే నిజమే. ఆ పార్టీ తరఫునే గెలిచినది నిజమేగానీ.. జగన్ వ్యవహార సరళికి తమ రాజకీయ భవిష్యత్తును బలి చేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు.
అలాంటి పరిస్థితుల్లోనూ అనేక మునిసిపాలిటీలు ఇప్పటికే కూటమి పార్టీల పరం అయ్యాయి. విశాఖపట్టణం విషయంలో కూడా పెద్ద హైడ్రామానే నడిచింది. బొత్స సత్యానారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాధ్ ఇలా ఎందరు పెద్దనేతల్ని రంగంలోకి దించినా.. కార్పొరేటర్లను పార్టీలో కట్టిపడేసే ప్రయత్నాలు ఫలించలేదు. వారు కూటమి పార్టీల్లోచేరి.. మళ్లీ తమను ఒత్తిడి చేసే అవకాశం కూడా ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫైనల్ గా అవిశ్వాస తీర్మానం పై సమావేశం జరిగే నాటికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి గైర్హాజరైంది. కూటమిలో చేరిన వారిని ఒక్కరినైనా లొంగదీసుకోగలిగితే.. కోరం లేకుండా సమావేశం జరగదని ఆశపడింది. కానీ.. కూటమి నేతలు కూడా వ్యూహాత్మకంగా జాగ్రత్తలు తీసుకోవడంతో.. అవిశ్వాస తీర్మానం నెగ్గి.. కార్పొరేషన్ కూటమి పరం అయింది. కొత్త మేయర్ ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా త్వరలోనే ఉంటుందని ఎమ్మెల్యే గంటా ప్రకటించారు కూడా.