జగన్ కు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇప్పుడు జైలులో కుమిలిపోతున్నారో లేదో గానీ.. బయట ఉన్న ఆయన వర్గీయులు, అభిమానులు మాత్రం మనస్తాపంలో ఉన్నారు. తమ నాయకుడు జైలులో ఉన్నాడు. తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యాడు. ఆదివారం రాత్రిలోగా.. మిథున్ కూడా రిమాండు నిమిత్తం జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పటినుంచి.. రాష్ట్రానికి అతిపెద్ద ద్రోహం జరిగిపోయినట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నానా రాద్ధాంతమూ చేస్తోంది. అదే సమయంలో.. చెవిరెడ్డి అరెస్టు అయినప్పుడు ఈ స్థాయిలో పార్టీ నాయకులందరూ బయటకు వచ్చి మాట్లాడడం, ఖండించడం జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తమ నాయకుడు ఎంత విశ్వాసంగా ఉంటూ సేవలు చేస్తున్నప్పటికీ.. అక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గానే చూస్తున్నారని, మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు ఒకరకంగా- భాస్కర రెడ్డి అరెస్టు అయినప్పుడు మరో రకంగా పార్టీ స్పందిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిధున్ రెడ్డి అరెస్టు గురించి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ నిన్న రాత్రినుంచి తమ ఖండనలను వరుసగా విడుదల చేస్తూనే ఉన్నారు. ఆదివారం మొత్తం కూడా రాష్ట్రమంతా వైసీపీ నాయకులు ఇదే టాపిక్ మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే.. తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా అంతే కీలకమైన నాయకుడు అయినప్పటికీ.. పార్టీలో జగన్ కు ఇంకా గొప్పగా సేవలు చేసిన నాయకుడు అయినప్పటికీ.. ఆయన అరెస్టు అయినప్పుడు పార్టీ ఈ స్థాయిలో స్పందించలేదని ఆయన అబిమానులు బాధపడుతున్నట్టు సమాచారం.
నిజానికి లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన నేరాలకు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన నేరాలకు చాలా వ్యత్యాసం ఉన్నదని చెవిరెడ్డి అభిమానులు అనుకుంటున్నారు. అసలు స్కామ్ రూపకల్పన దగ్గరినుంచి ఏ రకంగా దోచుకోవాలి.. ఎవరెవరినుంచి దోచుకోవాలి.. లాంటి వ్యవహారాల ప్లానింగ్ దశ నుంచీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాగస్వామి అని, అదే చెవిరెడ్డి విషయానికి వస్తే.. ఎన్నికల ముందు జగన్ పురమాయింపు మేరకు వసూళ్ల సొమ్మును తీసుకువెళ్లి కొందరు అభ్యర్థులకు పంచిపెట్టడం తప్ప ఆయన ఏ పాపం ఎరగడని ఏమీ బావుకోలేదని వారు అంటున్నారు.
అలాగే.. స్కామ్ సాగినం కాలమూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రతినెల 5 కోట్లరూపాయలు తన వాటాగా తీసుకున్నట్టుగా సిట్ విచారణలో తేలడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి మిథున్ రెడ్డికోసం జగన్ గానీ, వైసీపీ పార్టీ నాయకులందరూ గానీ పడుతున్న ఆరాటంలో కనీసం పదో వంతు.. అప్పట్లో చెవిరెడ్డిని అరెస్టు చేసినప్పుడు చూపించిఉంటే తమకు ఎంతోనైతిక స్థైర్యం ఉండేదని అనుకుంటున్నారు.