ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు లేకుండా ఒక్కమాట కూడా మాట్లాడలేరు అనే సంగతి.. ఆయన ప్రసంగాలను గమనించే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక్క మాట మాట్లాడాలంటే.. పది సార్లు, పోడియం మీద పెట్టుకున్న స్క్రిప్టు కాగితాలను చూస్తూ ఆయన మాట్లాడుతుంటారు. తనకు స్క్రిప్టు రాసి యిచ్చే ‘అయినవాళ్లు’ ఏయే మాటలు వాడారో.. అవే మాటలను యథాతథంగా పలకాలని జగన్ ఆరాటపడుతుంటారు. అయితే తాజాగా బాపట్ల జిల్లాలో జరిగిన సిద్ధం సభలో జగన్ ప్రసంగాన్ని గమనిస్తే.. పరిపాలనలో మాత్రమే కాదు.. ఆయన మాటల్లో కూడా క్లారిటీలేదనే సంగతి మనకు అర్థమవుతుంది. ఒకమాటను మరోమాట కాంట్రడిక్ట్ చేస్తూ.. పరస్పర విరుద్ధంగా ఆయన మాటలు సాగిపోతున్నాయి.
చంద్రబాబునాయుడు గెలిస్తే తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఆగిపోతాయని జగన్ తొలినుంచి ఒక విషప్రచారాన్ని సాగిస్తూ వస్తున్నారు. అలా చెప్పడం వల్ల ఇక చంద్రబాబుకు ఓట్లు పడవు అనేది ఆయన నమ్మకం. మరొకవైపు చంద్రబాబు మాత్రం.. ఇప్పుడున్న అన్ని పథకాలను కొనసాగించడంతో పాటు, అర్హులందరికీ కూడా అందేలా చూస్తాం అని స్పష్టంగానే చెబుతున్నారు. కానీ బాబు గెలిస్తే అన్నీ ఆగిపోతాయని చెప్పడం ద్వారా ప్రజల్లో భయం పుట్టించడమే జగన్ టార్గెట్ గా ఆయన మాటలు ఉంటుంటాయి. మేదరమిట్ట సిద్ధం సభలో కూడా జగన్ ఇవే ఆరోపణల్ని రిపీట్ చేశారు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. పథకాల రద్దుకు ఓటేయడమే అంటూ సెలవిచ్చారు. అంతలోనే ఆ మాటలనే కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా.. మనం అమలు చేస్తున్న 8 పథకాలను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందే అంటూ మరో మాట కూడా సెలవిచ్చారు. చంద్రబాబు మీద వేస్తున్న నిందకు విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనే, తెలుగుదేశానికి మేలు చేసేలా ఉన్నది.
ఎందుకంటే.. జగన్ మాటలు నిజమే అనుకుంటే.. ఆయన అమలు చేస్తున్న 8 పథకాలను కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడినా అమలు చేసే తీరాల్సిన వాతావరణమే ఉన్నదని అనుకుందాం. అలాంటప్పుడు ఇక జగన్ ఎందుకు? ఆ పథకాలు ఎటూ కొనసాగుతాయి కదా. ఆ పథకాలు మంచివే అనుకుంటే.. వాటిని కొనసాగించడంతో పాటు రాష్ట్ర విధ్వంసానికి పాల్పడకుండా, రాష్ట్ర అభివృద్ధికి కూడా కష్టపడే చంద్రబాబును గెలిపించడం మంచిది కదా అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.
జగన్ పథకాలు తప్ప.. రాష్ట్ర ప్రగతిని పక్కనపెట్టేశారు. అలాంటప్పుడు పథకాలతో పాటు ప్రగతిని కూడా చూపించే బాబు పాలన వైపు ప్రజలు మొగ్గడంలో ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకున్న వారు.. చంద్రబాబుకు ఓటేయాలనే అనుకుంటారని విశ్లేషకులు అంటున్నారు.