కేశినేని నాని ఆశీస్సులతోనే కొలికపూడి కుట్ర!

కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు- విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం తెలుగుదేశం పార్టీకి నష్టదాయకంగా పరిణమించేలా ముందుకు సాగుతోంది. తన మాటల్లో పైకి నారా చంద్రబాబు నాయుడును, లోకేష్ ను కీర్తిస్తూనే ఉన్నప్పటికీ కేశినేని చిన్ని కి వారి ఆశీస్సులు ఉన్నాయని అర్థం వచ్చేలా విమర్శలు చేయడం ద్వారా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏం లక్ష్యిస్తున్నారో స్పష్టంగానే అర్థమవుతోంది. పార్టీ తన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా పరవాలేదని బరితెగించి ఆయన అడ్డగోలుగా పార్టీ మీద విమర్శలు చేయడానికి సాహసిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన మాటల్లోనే నిగూఢంగా వ్యక్తమవుతున్న భావాలను బట్టి అదనంగా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంలో తనకు ఠికానా ఉండబోదు అనే స్పష్టతతోనే కొలికపూడి ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. విజయవాడ మాజీ ఎంపీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశినేని నాని ఆశీస్సులు కొలికపూడికి పుష్కలంగా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది.

కొలికపూడి శ్రీనివాసరావు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ కేశినేని చిన్ని మీద అనేక ఆరోపణలు చేయడంతో పాటు, నానిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన విలువలు గల రాజకీయాలు మాత్రమే చేస్తారంటూ కొనియాడారు. నాని ఆశీస్సులతోనే కొలకపూడి రెచ్చిపోతున్నట్లుగా అనుకోవడానికి దీనితోపాటు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. కేశినేని చిన్ని ఆరోపిస్తున్నట్లుగా జగన్ తరఫున కోవర్టు లాగా ప్రస్తుతం కొలికపూడి పని చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆరోపణలను ఖండించడానికి ఆయన  చెబుతున్నది ఒకటే మాట. తాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నానని, జగన్ కు అనుకూలంగా గతంలో ఎన్నడూ ఒక్క వాక్యం కూడా మాట్లాడిన దాఖలాలు లేవని మాత్రమే అంటున్నారు. అంతకుమించి ఆయన తాను కోవర్టు కాదనడానికి చెప్పుకుంటున్న కారణాలు వేరే లేవు.

అయితే ఇక్కడే అసలు సందేహం పొడచూపుతోంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యే కొలికపూడి మీద వచ్చిన ఆరోపణలు,పార్టీ అధిష్టానం ఆయన మీద సీరియస్ కావడం, అనేక సందర్భాలలో పిలిచి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కదు అనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో కేశినేని చిన్నికి నష్టం జరిగేలాగా విమర్శలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి వైసిపి టికెట్ ఇప్పించడానికి కేశినేని నాని హామీ ఇచ్చినట్లుగా ఒక పుకారు వినిపిస్తోంది. అందుకే వైసిపి తరఫున గత ఎన్నికలలో తన మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తితో కూడా కొలికపూడి ప్రస్తుతం స్నేహం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. గతంలో ఎన్నడూ జగన్ కు అనుకూలంగా మాట్లాడకపోయినప్పటికీ 2029 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి అనుకూలంగా కొలికపూడి ఒక వాదన తయారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎలాగంటే తాను అమరావతి పరిరక్షణ కోసం మాత్రమే పాటుపడుతున్నానని.. మూడు రాజధానులు అన్నప్పుడు జగన్ను వ్యతిరేకించానని.. ఇప్పుడు వైసీపీ కూడా అమరావతికి అనుకూలంగా ఉన్నది కనుక తన ఆ పార్టీలో చేరానని చెప్పుకోడానికి అనుకూలంగా ఆయన వాదన సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. మొత్తానికి ఒక సుదీర్ఘమైన వ్యూహంతో కేశినేని నాని ఎమ్మెల్యే కొలికపూటి శ్రీనివాసరావును పావుగా వాడుకుంటూ కేశినేని చిన్నిని, తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి కుట్ర రాజకీయాలు నడిపిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories