తమ ఓటమి వారికి కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదో అతి కష్టం మీద మేనేజ్ చేయగలిగిన ఒకటి రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెల్లడించినంత మాత్రాన.. ఆ పార్టీ నాయకులు సంతోషంగా లేరు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినవి సమస్తం బోగస్ ఎగ్జిట్ పోల్ నివేదికలు అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన నివేదికలు మాత్రమే నిజం చెప్పాయని వారు చాలా సహజంగా సమర్ధించుకుంటున్నారు. అయితే ఆ మాటలు వెల్లడిస్తున్నప్పుడు కూడా మొహంలో కళాకాంతులు కనిపించడం లేదు.
ఓటమి ఖరారు అని తేలిపోయిన నేపథ్యంలో- అది ప్రజలు మనల్ని తిరస్కరించినట్లు కాదని.. అందులో తెలుగుదేశం పార్టీ కుట్రలు ఉన్నాయనీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫలితాల తర్వాత ఐదు సంవత్సరాల పాటు మాట్లాడుతూనే ఉంటారు- అనే సంగతి అందరికీ తెలుసు. అయితే నైతిక విజయం తమదే అని, కుట్రలు వల్లే ఓడామని చెప్పుకోవడానికి వారికి ఒక మంచి సాకు దొరికింది. ఆమేరకు హైకోర్టు వారి నెత్తిన పాలు పోసింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ.. హైకోర్టుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు తీవ్రమైన భంగపాటు ఎదురయింది.
పోస్టల్ బ్యాలెట్ లలో ఫారం 13 మీద అటేస్టింగ్ అధికారి పేరు హోదా సీలు లేకపోయినా సరే కేవలం సంతకం ఉంటే చాలు ఆయా ఓట్లను లెక్కించి తీరాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నాలుగు రోజుల కిందట మెమో జారీ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది రూపొందించిన నిబంధనల మేరకు.. అటేస్టింగ్ అధికారి స్టాంపు కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఈ మెమో ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. వైయస్సార్ కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ పై తాజాగా శనివారం నాడు తీర్పు వెల్లడించిన ధర్మాసనం.. ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల అటేస్టింగ్ అధికారి స్టాంపు లేకపోవడం వలన దొంగ ఓట్లు పడతాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ.
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన అనే పాటించేలా చూడాలని, రాష్ట్ర ఎన్నికల అధికారి ఇచ్చిన మెమోలు రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు బోలెడన్ని దొంగ ఓట్లు పడ్డాయని అందువల్లనే తెలుగుదేశం గెలిచిందని రెండు రోజుల తర్వాత నానా యాగి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరికింది. ప్రజలు తమ పరిపాలనను తిరస్కరించారు అనేది జీర్ణం చేసుకోలేక.. ఇలాంటి డొంకతిరుగుడు మాటలు మాట్లాడడానికి ఆ పార్టీ వారు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది.