ఏపీ పోలీస్ : ఎక్స్‌ట్రా ఫోర్స్ అండ్ ఎక్స్‌ట్రా కేర్

పోయినచోటనే వెతుక్కోవాలనేది సామెత. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా అదే ప్రయత్నంలో ఉంది. ఎక్కడైతే తమ పరువు పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. మంగళవారం నాడు ఎంతో కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా.. వీసమెత్తు అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా.. బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించడానికి పోలీసుయంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.
గత అయిదేళ్ల జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారనే అపకీర్తిని వారు మూటగట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ వైసీపీ నాయకులు ఎలా చెబితే అలా చేయడం మాత్రమే కాదు.. వారి అడుగులకు మడుగులొత్తుతూ బతికారనే చెడ్డపేరు కూడా పోలీసులకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి సమయాల్లో ప్రత్యర్థి పార్టీల వారు నామినేషన్లు వేయకుండా పోలీసులే కిడ్నాప్ చేసి బెదిరించిన సందర్భాలుకూడా జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికలు వచ్చాక దారితప్పిపోయిన అదే వ్యవస్థ అలాగే కొనసాగింది. అనేక చోట్ల పోలీసు అధికారుల్ని మార్చేస్తూ ఈసీ ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరించింది. చివరికి జగన్ కు అత్యంత వీరవిధేయుడిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాధ రెడ్డిని కూడా మార్చారు. ఆలోగానే పోలీసు వ్యవస్థ పరువు మొత్తం మంటగలిసింది. పోలింగ్ నాడు అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. పోలీసులు ప్రేక్షకులే అయ్యారు. పరువు పోగొట్టుకున్నారు.
ఇప్పుడు కౌంటింగ్ నాడు.. అలాంటివి ఏమాత్రం జరగకుండా పటిష్టంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ రాష్ట్ర, కేంద్ర బలగాలతో ఉంటుందనే సంగతి తెలిసిందే. అల్లర్లు చేస్తారనే అనుమానం ఉన్న నాయకులు అందరినీ బైండోవర్ చేస్తున్నారు. హౌస్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద.. కాస్త తోక జాడిస్తే చాలు పూర్తిగా కత్తిరించడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తెలుగుదేశం విజయాన్నే సూచిస్తుండడం కూడా పోలీసులు నిజాయితీగా ధైర్యంగా పనిచేయాలని అనుకోవడానికి ఒక కారణం కావొచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ పూర్తి సవ్యంగా జరిగితే నిజంగానే పోలీసు వ్యవస్థకు పోయిన పరువు తిరిగి వస్తుందని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories