జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్నను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ హత్య చేసిన వాళ్లు, వాళ్ల వెనుకఉండి.. తమ చేతికి నెత్తురు చుక్క అంటకుండా ఆ దారుణం చేయించిన వారు, వారి వెనుక ఉండి.. ఇబ్బంది రాకుండా మేం కాపాడుతాం అని భరోసా ఇచ్చిన వారు.. అన్ని రకాలవారూ ఈ కేసులో ఉన్నారు. హత్య జరిగిన సమయంనుంచి వీరందరూ ఎన్ని రకాల డ్రామాలు నడిపించారో మనందరికీ తెలుసు. ఈ హత్యవెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. వివేకానందరెడ్ది సొంత కూతురు, అల్లుడే ఆయనను చంపించారంటూ ఒక కేసు కూడా పెట్టారు. అయితే ఈ విషయంలో వారి కుట్రలు, ఆగడాలు చెల్లుబాటు కావని సుప్రీం కోర్టు దాదాపుగా తేల్చి చెప్పినట్టు అయింది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పెట్టిన హత్య కేసును క్వాష్ చేస్తాం అని సుప్రీం కోర్టు ప్రకటించింది. అలాగే.. అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్ పై పెట్టిన కేసును కూడా క్వాష్ చేయబోతున్నట్టుగా సుప్రీం తెలియజేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో తొలినుంచి హైడ్రామా నడుస్తూనే ఉంది. తన తండ్రిని చంపిన నిందితులను అరెస్టు చేయాలని, తెరవెనుక ఉన్న సూత్రధారులను కూడా బయటకు తీసుకురావాలని.. తనకు న్యాయం కావాలని వివేకా కుమార్తె సునీత.. సుప్రీంకోర్టులో పిటిషన్ నడుపుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఈ కేసులో బెయిలు మీద బయట తిరుగుతున్న కీలక నిందితుల బెయిళ్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంలో పోరాడుతున్నారు. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హత్యకు గురైన వివేకా కూతురు, అల్లుడు, సీబీఐ అధికారి మీద కుట్రపూరితంగా పెట్టిన కేసుల్ని క్వాష్ చేస్తామని ప్రకటించారు.
తన తండ్రిని హత్య చేసిన తర్వాత.. తొలుత గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులు అని రకరకాల మాటలతో మాయ చేయడానికి ప్రయత్నించిన వైనం గురించి సుప్రీం ధర్మాసనానికి వివరించారు. అన్ని డ్రామాలు అడిన హంతకులు, అది హత్యే అని బాహ్యప్రపంచానికి స్పష్టమైన తరువాత.. కొత్త డ్రామా ప్రారంభించారు. అవినాష్ రెడ్డి స్వయంగా.. సునీత, రాజశేఖర రెడ్డి కలిసి వివేకాను హత్య చేయించారని అన్నారు. అనేక సందర్భాల్లోమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఇద్దరే హంతకులని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో సుప్రీం వారిపై పెట్టిన కేసును క్వాష్ చేస్తామని ప్రకటించడం న్యాయం కోసం పోరాడుతున్నవ వారికి పెద్ద ఊరట. అదే సమయంలో.. జగన్ మరియు అవినాష్ వర్గానిక పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముగియలేదని, ఇంకా సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని.. సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం న్యాయస్థానానికి నివేదించడం గమనార్హం. మొత్తానికి తాము ఎంత తప్పుడు ప్రచారం చేసినా.. ధర్మాసంన ముందు అది నీరుగారిపోవాల్సిందే అని.. అవినాష్ రెడ్డి, జగన్ అండ్ కో కు ఈ పాటికి అర్థమైఉంటుందని ప్రజలు అంటున్నారు.