అన్నా చెల్లెళ్లవి కుమ్మక్కు రాజకీయాలేనంట?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త రహస్యాన్ని బయటపెట్టారు. ఆయనకు ఉన్న సమాచారం ఏమిటో, దాని ఆధారం ఏమిటో గానీ.. మొత్తానికి సరికొత్త కుమ్మక్కు రాజకీయాల గుట్టు విప్పుతున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏపీలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్న ఆయన చెల్లెలు షర్మిల ఇద్దరూ కలిసి కుమ్మక్కు అయి.. విపక్షకూటమికి ఓటు పడకుండా ఉండేందుకు డ్రామా నడిపిస్తున్నారన్నట్టుగా మోడీ వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదని, వారు నాటకం ఆడుతున్నారని, జగన్ వ్యతిరేక ఓటును కాంగ్రెసుకు మళ్లించేందుకు ఆయన చెల్లెలు ఆ పార్టీ సారథ్యం తీసుకుని ఇలా చేస్తున్నారని మోడీ ఆరోపించారు.
2019లో జగన్ గెలవడానికి తన శక్తివంచన లేకుండా పనిచేసిన తర్వాత, షర్మిల ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. తెలంగాణలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి, అక్కడ సీఎం అవుతానంటూ పాదయాత్రల రాజకీయం ప్రారంభించారు. అయితే ఎన్నికలు వచ్చేనాటికి తన పార్టీ తరఫున ఒక్కసీటైనా గెలిచే అవకాశం లేదనే అవగాహన కలగడం, అదే సమయంలో కాంగ్రెసు పార్టీనుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆమె ఎన్నికల బరినుంచి తప్పుకుని, అక్కడ విజయం తర్వాత, తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ఏపీసీసీ సారథ్యం పుచ్చుకున్నారు. అప్పటినుంచి ఆమె ఏకపక్షంగా జగన్ మీద విరుచుకుపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ప్రత్యేకహోదా అంశమ్మీద, కడపలో తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్ మీద నిశిత విమర్శలతో విరుచుకుపడుతూ ఊపిరాడకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులైన ప్రజల్లో జగన్ అంటే ఇష్టపడని వారు.. షర్మిలవైపు మొగ్గుతారని, అంచనాలుసాగుతున్నాయి. అయితే ఇవాళ చిలకలూరిపేట సభలో మోడీ ఒక కొత్త సంగతి బయటపెట్టారు.
జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే షర్మిల రంగంలోకి వచ్చారని, ఇది కూడా జగన్ వ్యూహమేనని అనుకునేలా ఆయన వివరించారు. ప్రజలు అలాంటి మాయోపాయాలకు లొగవద్దని.. జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పోల్లుపోకుండా.. బిజెపి తెలుగుదేశం జనసేన కూటమికి పడేలా అందరూ కష్టపడాలని ఆయన పిలుపు ఇచ్చారు.
షర్మిల పీసీసీ సారథ్యం స్వీకరించడం పట్ల అందరూ ఒక కోణాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు. కానీ ఈ వ్యవహారంలో రెండో కోణాన్ని చూడడం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమైందని అంతా అనుకుంటున్నారు.