అంతా వైసీపీ తొత్తులే.. ఇవి అసలు నిష్పాక్షిక ఎన్నికలా?

తనకు పోస్టింగు వేయించిన మహానుభావుడు అనే అనల్పమైన భక్తితో ఒక రిటర్నింగ్ అధికారి, సదరు నాయకుడి నామినేషన్లో ఎన్ని లోపాలున్నా ఆమోదించేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి వచ్చే వారిని బెదిరించి భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పేరుతోనే మరొకరు నామినేషన్ వేయడానికి వస్తే వారిని, ఏకంగా పోలీసులే అపహరించేసి.. నామినేషన్ దాఖలు కానివ్వకుండా అధికార పార్టీ తరఫున ఆ బాధ్యత తీసుకుంటారు. ఈ పరిణామాలను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యం పరిహాసాస్పదం అవుతున్న ప్రస్తుత సమయంలో.. ప్రజాస్వామిక వాదులకు, నిష్పాక్షికతను కోరుకునే ప్రజలకు ఆవేదన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు యంత్రాంగం సహా యావత్ అధికార గణాలు అధికార పార్టీ వారి ఆదేశాలకు అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తున్న తీరు, జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఎగబడుతున్న వైనం విస్తు గొలుపుతున్నాయి.
గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ఆమోదం పొందడమే పెద్ద వివాదంగా మారింది. ఆయన మునిసిపాలిటీలనుంచి అద్దెకు తీసుకున్న భవనం గురించిన వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదని తెలుగుదేశం నాయకులు ఆధారాల సహా ఫిర్యాదుచేసినప్పటికీ.. రిటర్నింగ్ అధికారి ఆర్డీవో పద్మావతి దానిని ఆమోదించారు. కొడాలి నాని విషయంలో సదరు రిటర్నింగ్ అధికారి పాత్ర తొలినుంచి వివాదాస్పదంగానే ఉండడం విశేషం.

కొన్ని రోజుల కిందట ప్రచారంలో ఉన్న కొడాలి నాని ప్రజల ఎదుటనుంచే ఆర్డీవోకు ఫోను చేసి వీళ్లందరికీ పాత డేట్లు వేసి ఇళ్ల పట్టాలు ఇచ్చేయవచ్చు కదా.. అని పురమాయిస్తే.. ‘అవన్నీ ఈ కాల్ లో వద్దు సార్.. నేను వాట్సప్ కాల్ చేస్తాను సార్..’ అంటూ  అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్న వైఖరిని బయటపెట్టుకున్న తీరును ప్రజలందరూ గమనించారు. ఆ వీడియో లీకై సంచలనం సృష్టించింది. సదరు ఆర్డీవోపై ఎలాంటి చర్యలు తీసుకోనేలేదు. ఆమే ఇప్పుడు రిటర్నింగ్ అధికారిగా కొడాలి నానికి ఫేవర్ చేయడానికి తన వంతు కష్టం పడుతున్నారు. ఆయనే తనకు ఆర్డీవోగా తొలిపోస్టింగు వేయించారనే కృతజ్ఞతతో ఇలా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. ఆ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో మరో వికలాంగుడు నామినేషన్ వేయడానికి వస్తే.. తీసుకోకుండా బెదిరించి యాగీ చేసి, చివరికి వివాదం ముదురుతోందని గ్రహించి తీసుకున్న వైనం కూడా బయటకు వస్తోంది.

రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు.. వైసీపీ అభ్యర్థులు పేర్లతో మరొకరు నామినేషన్ వేయడానికి వస్తే తీసుకోకుండా తిరస్కరిస్తున్నారని, అలాంటి అభ్యర్థులను ఏకంగా కిడ్నాప్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా నామినేషన్ వేయడానికి సిద్ధమైన విడదల రజని అనే మహిళను అక్కడి పోలీసులు ఏకంగా కిడ్నాప్ చేశారంటూ ఆమె నామినేషన్ ను ప్రపోజ్ చేసిన వ్యక్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం ఇంకా వివాదాస్పదం అవుతోంది. పోలీసులు వైసీపీ నేతలకు ఏ రకంగా కొమ్ముకాస్తున్నారో దీనిని చూస్తే అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసీ ఇలాంటి వారి మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories