వేటు వేయాలని ఉబలాటం.. ఆధారాల్లేక ఇరకాటం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉంది. ఈ పార్టీ మునుగుతున్న నావ అనే సంగతి ముందుగానే గ్రహించిన చాలా మంది నాయకులు ఆ పార్టీనుంచి బయటకు వచ్చి.. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరిపోయారు. నిబంధనల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సభల నిర్వహణ అనేది తమ వారి చేతిలో ఉన్న వ్యవహారం గనుక.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఎడాపెడా వారిపై వేటు వేయించేసింది. అయితే ఒక్క ఎమ్మెల్సీ విషయంలో మాత్రం వారు ఏమీ చేయలేక, కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు. తమ మీద నమ్మకం సడలిపోయి, తాము చేసిన వంచనకు వెరసి.. ఆయన తెలుగుదేశానికి దగ్గరయ్యాడని వారికి తెలుసు. ఆయన మీద వేటు వేసేయడానికి మండలి ఛైర్మన్ కు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే వేటు పడినా వివాదం కాకుండా ఉండడానికి సరైన ఆధారాలు మాత్రం వారికి దొరకడం లేదు. సదరు ఎమ్మెల్సీ కూడా.. వైసీపీకి దూరమైనా సరే.. తెలుగుదేశం ముద్ర తన మీద లేకుండా జాగ్రత్తపడడమే అందుకు కారణం.
నిజానికి ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయించడం అనేది ఎమ్మెల్యేల మీద వేటు వేసినంత ఈజీ కాదు. అయితే.. మండలి ఛైర్మన్ తమ పార్టీ నాయకుడే గనుక.. వైసీపీ ఇష్టారాజ్యంగా వేటు వేయిస్తూ వచ్చింది. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన సీనియర్ నేతలు జంగా కృష్ణమూర్తి, సి. రామచంద్రయ్య, జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్ లపై ఆల్రెడీ వేటు వేయించారు. అయితే ఎస్.కోట నాయకుడు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాత్రం వారికి మింగుడు పడలేదు.
ఇందుకూరి రఘురాజు భార్య ఎంపీపీ పదవిలో ఉన్న సుబ్బలక్ష్మి తెలుగుదేశంలో చేరారు. అంతే తప్ప ఆయన పార్టీ కండువా కప్పుకోలేదు. ఆయన అనుచరులైన కొందరు నాయకులు కూడా చేరారు. అయితే వారు లోకేష్ తో ఉన్న ఒక ఫోటోను, వారితో రఘురాజు ఉన్న మరొక ఫోటోను విడివిడిగా తమ పితూరీకి కలిపి పంపి.. వాటి ఆధారంగా రఘురాజు కు ఎమ్మెల్సీ పదవిలేకుండా చేయాలని వైసీపీ ఫిర్యాదుచేసింది.
అయితే వైసీపీ ఎత్తులకు రఘురాజు లొంగడం లేదు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆధారాలు లేకపోయినా.. వేటు వేయించే పట్టుదలతో ఉండగా.. అదే జరిగితే హైకోర్టుకు వెళ్లే ఉద్దేశంతో రఘురాజు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం పాపం.. వైసీపీకి ఇరకాటంగా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories