ఏపీలో చిత్రమైన పరిణామం ఇది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్నాళ్లూ తమ ప్రధాన దోపిడీ వనరులుగా మార్చుకున్న ప్రభుత్వ మార్గాలను ఇప్పుడు ఒక్కటొక్కటిగా మూసివవేస్తున్నారు. మేము దోచుకున్న మార్గంలో మీరు దోచుకోవడానికి మాత్రం వీల్లేదు అన్నట్టుగా వారి తీరు ఉంటోంది. రాష్ట్రంలో జూన్ 4 తర్వాత ప్రభుత్వం మారబోతున్నదనే అభిప్రాయం వైసీపీ పెద్దలకు బాగానే కలిగినట్లుంది. అందుకు నిదర్శనంగా.. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నదని ఆరోపణలు ఎదుర్కొన్న మార్గాలను ఇప్పుడు వారు మూసివేస్తున్నారు. ఇందుకు లిక్కర్ షాపుల్లో ఇన్నాళ్లుగా సాగుతున్న దందా ఒక్కసారిగా రూపుమార్చుకోవడమే పెద్ద ఉదాహరణ.
సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను అనే హామీతో మహిళాలోకాన్ని నమ్మించి 29019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ లిక్కర్ దుకాణాలు అన్నింటినీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మార్చడం తప్ప చేసిందేమీ లేదు. లిక్కర్ దుకాణాల్ని దోపిడీ మార్గాలుగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. అంతా ప్రభుత్వం సాగించే విక్రయాలే గానీ.. ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా సుదీర్ఘకాలం దందా నడిపించారు. నోట్ల రద్దు ఎపిసోడ్ తర్వాత దేశంలో కిళ్లీ బంకుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుండగా.. ఏపీలో ఇసుక, మద్యం మాత్రం కేవలం నగదు పేమెంట్స్ మీద మాత్రమే నడుస్తూ వచ్చాయి. రికార్డుల్లో చూపించకుండా విచ్చలిడిగా విక్రయాల మొత్తాన్ని వైసీపీ నాయకులు స్వహా చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేసేస్తున్నట్టుగా బిజెపి రాష్ట్ర సారథి పురందేశ్వరి గణాంకాల సహా వివరించారు.
అయితే డిజిటల్ పేమెంట్లను కూడా అనుమతిస్తూ రెండేళ్ల కిందట ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఏడాది కిందటి వరకు దాని అమలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఏదో నామమాత్రంగా అమలవుతూ ఉండేది. హఠాత్తుగా డిజిటల్ పేమెంట్ల మీద ప్రభుత్వానికి శ్రద్ధ పుట్టింది. కొన్ని రోజులుగా ఉదయం నుంచి 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేవలం డిజిటల్ పేమెంట్లు మాత్రమే స్వీకరించాలని, ఆ తర్వాత నగదుకు కూడా విక్రయించవచ్చునని కొత్తగా ఆదేశాలు అమలవుతున్నాయి.
చూడబోతే.. లిక్కరు ్వయాపారం ద్వారా దోచుకోవడానికి తాము ఏర్పాటు చేసుకున్న పటిష్టమైన దారిలో కొత్తగా ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వం దోచుకోవడానికి వీల్లేదనే కుట్ర ఆలోచనతో ఈ ఆదేశాలు వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి గమనిస్తే.. తాము ఓడిపోబోతున్నట్టుగా వైసీపీకి చాలా క్లియర్ గా అర్థమైందని ప్రజలు అనుకుంటున్నారు.