అపరిమితమైన ప్రజాదరణతో తమను తాము నాయకులుగా నిరూపించుకుని.. తమ ప్రజాదరణకు తగినట్టుగా తమ పార్టీలో కూడా ప్రాధాన్యాన్ని పొందుతూ.. తాము ప్రభుత్వంలోకి వస్తే మంత్రిపదవులు కూడా పొందే విశిష్టమైన వ్యక్తులు కొందరు ఉంటారు. అలాగే, కేవలం కులాన్ని నమ్ముకుని, ఆ కులంలో పుట్టడం వల్ల మాత్రమే తమకు మంత్రి పదవులు కావాల్సిందేనని పట్టుబట్టి సాధించుకునే వారు కూడా ఉంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా.. కేవలం నోరున్నది కదాని.. ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద అడ్డగోలుగా విరుచుకుపడిపోతూ.. అర్థం పర్థం లేని విమర్శలు, చవకబారు బురద చల్లుడు కార్యక్రమాలతో రెచ్చిపోతూ.. తమ అధినేత కళ్లలో సంతోషం చూడడమే లక్ష్యంగా బతుకుతూ.. అలాంటి ప్రతిభకు మంత్రిపదవులు, విలువ దక్కాలని కోరుకునే వారు కూడా కొందరుంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను గమనిస్తే.. ఈ మూడో కేటగిరీకి చెందిన కొందరు సీనియర్ నాయకులకు గడ్డురోజులు దాపురించినట్లుగా కనిపిస్తోంది.
జగన్ సర్కారులో అలాంటివారు ఎవరున్నారా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందు వరుసలో వినిపించే పేర్లలో అంబటి రాంబాబు, ఆర్కే రోజా తప్పకుండా ఉంటారు. ఆ ఇద్దరికీ టికెట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు పార్టీలో చర్చగా ఉంది.
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే గనుక.. ఓడించి తీరుతాం అంటూ అక్కడి పార్టీ నాయకులు అంతా జట్టుకట్టారు. వారినందరినీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి మంతనాలు సాగిస్తున్నారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారనే పేరుంది. ఆ నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా స్థానిక పార్టీ నాయకుల నిరసనలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని కొన్ని ఏళ్ల నుంచి ఆ గ్రూపులన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. అయినా అంబటి మాత్రం వారిని పట్టించుకోలేదు. తీరా ఎన్నికల సీజను వచ్చేసింది. ఆయన మీద వ్యతిరేకత ఇప్పుడు తారస్థాయికి చేరింది. పట్టించుకోకపోతే అంబటి ఓటమి తథ్యమయ్యే వాతావరణం ఏర్పడడంతో స్వయంగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన ఎన్ని రాజీమాటలు చెప్పినా పరిస్థితి మారకపోవచ్చునని, అంబటి రాంబాబుకు టికెట్ దక్కదని ఊహాగానాలు సాగుతున్నాయి.
అంబటి మాదిరిగానే రాజకీయ ప్రత్యర్థుల మీద నోరేసుకుని పడిపోవడంలో మంత్రి రోజా కూడా తనదైన ముద్ర చూపిస్తూ ఉంటారు. అత్యంత వెటకారంగా, వెకిలి తిట్లు తిడుతూ.. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆనందించేలా చేస్తుంటారు. ఆ రోజాకు కూడా ఇప్పుడు టికెట్ దక్కడం డౌటుగానే ఉంది. నగరి నియోజకవర్గంలోని నాయకులంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ యథావిధిగా తాడేపల్లికి చేరుకుంది. మరి ఆమెను ఆడపడుచు అని చెప్పుకున్న జగన్.. వారిని బుజ్జగిస్తారా లేక రోజాకే టికెట్ నిరాకరిస్తారా అనేది వేచిచూడాలి.