తిరుగులేని ఫలితం: మోడీ హ్యాట్రిక్ సర్కార్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వెల్లడవుతున్న ఎగ్జిట్ పోల్స్ లలో రెండు మూడు సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తమ అంచనాలను వెల్లడిస్తూ ఉన్నాయి. అవి తప్ప ఇంచుమించుగా ప్రతి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మాత్రమే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను కాసేపు పక్కన పెడితే దేశవ్యాప్తంగా చూసినప్పుడు.. ఎగ్జిట్ పోల్ అనేది వెల్లడించిన ప్రతి సంస్థ కూడా మోడీ సర్కార్ హ్యాట్రిక్ విజయం నమోదు చేయబోతున్నదనే సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. ‘‘అగలీబార్.. చార్ సౌ పార్’’ అంటూ ఏ నినాదం ద్వారా నరేంద్ర మోడీ, ఈ ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లారో.. ఆ నినాదం కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియదు గాని.. మొత్తానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం మాత్రం తథ్యం అని తేలిపోయింది.
నిజం చెప్పాలంటే కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కాంగ్రెస్ పార్టీకి ముందే అర్థమైంది. ఇండియా కూటమిలోని అనేక పార్టీలు ఏఐసీసీ సారధి మల్లికార్జున ఖర్గే నే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రతిపాదించినప్పటికీ.. ఆయన తనకు అక్కర్లేదు ఆ పదవికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అని చెప్పడం ద్వారా.. గెలిచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చేశారు. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన తర్వాత టీవీ ఛానల్ లలో జరిగే చర్చా కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరూ కూడా పాల్గొనడానికి వీల్లేదని అధిష్టానం ముందే ఆదేశించింది. ఈ ఆదేశాలు కూడా వారికి ఎలాంటి ఆశావహ దృక్పథం లేదు అనే సంగతిని స్పష్టం చేశాయి.
దీనికి తగ్గట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ప్రతి సంస్థ కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నది. ఎగ్జిట్ పోల్స్ చాలా సంస్థలు విడుదల చేసినప్పటికీ.. కాస్త ప్రామాణికమైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. రిపబ్లిక్ పీమార్క్, ఇండియా న్యూస్ డి డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్, జన్ కి బాత్, న్యూస్ నేషన్, దైనిక్ భాస్కర్, సి ఎన్ ఎక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ దైనిక్ భాస్కర్ మాత్రమే ఎన్డీఏ కూటమి గరిష్టంగా 350 సీట్లు సాధిస్తుందని, కనిష్టంగా 281 సీట్లతో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. తతిమ్మా అన్ని సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి కనీసం అనే అంకెను 350 సీట్ల ప్రాంతంలో కట్టబెట్టాయి. కాంగ్రెస్ పార్టీ వారి అభిమాన గణాలకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా పెద్ద నిరాశను కలిగించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories