విజయవాడలో ఎన్నికల ప్రచార యాత్రలో ఉన్న జగన్ కాన్వాయ్ పైకి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. సీఎం జగన్ తలకు గాయమైంది. ఎడమ కంటి పై భాగంలో ఆయనకు రాయి తగిలింది. చిన్న గాయమైంది. బస్సులోనే ప్రథమచికిత్స చేయించుకుని యాత్రను కొనసాగించిన జగన్, తన రాత్రి బసకు చేరుకున్న తర్వాత, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి డాక్టర్లకు చూపించుకున్నారు. వాపు ఎక్కువగా ఉన్నది గానీ.. గాయం చిన్నదే అని తేల్చిన డాక్టర్లు ఆయనకు రెండుకుట్లు వేశారు. ఎడమకంటికి పైభాగంలో నుదుటిమీద ఈ గాయం అయింది. జగన్, ఆదివారం నాటి బస్సుయాత్రకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఈ యాత్రలోనే జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా మరో రాయి తగిలి స్వల్ప గాయమైనట్టుగా చెబుతున్నారు.
జనంలోంచి ఎవరైనా రాయి విసిరారా? క్యాట్ బాల్ తో దూరం నుంచి కొట్టారా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగిన ప్రదేశాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ లో గంగానమ్మ గుడి దగ్గర జగన్ బస్సు యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. సీఎం బస్సు యాత్ర జరుగుతుండగా.. ఆ ప్రాంతంలో అప్పుడు విద్యుత్తు సరఫరా లేదు. విద్యుత్తు అధికారులు అంత నిర్లక్ష్యంగా ఎలా కరెంటు సరఫరా నిలిపేశారో తెలియదు. జగన్ గాయానికి కుట్లు వేసిన డాక్టరు వెంకటేష్ రెండు మూడురోజుల్లో కోలుకుంటారని, గాయం చిన్నదే కానీ, వాపు ఉన్నదని చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సాధారణంగా విపరీతమైన భద్రత వలయం మధ్య ఉంటారు. ఆయన చుట్టూ అంతమంది ఉండగా.. ఇలాంటి ఘటన ఎలా జరిగిందనేది అంతుపట్టడం లేదు. అనంతపురంలో జగన్ మీదకు జనంలోంచి ఎవరో చెప్పు విసిరారు. అది కూడా దాదాపు జగన్ మీదకే దూసుకువచ్చింది. ఆయన పక్కకు తప్పుకోవడంతో తగల్లేదు. అలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా.. రాష్ట్రంలో భద్రత ప్రోటోకాల్ పరంగా మొదటిస్థానంలో ఉండే ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అనే ప్రశ్న వస్తోంది. పోలీసులు భద్రత ఏర్పాట్ల విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారనే సందేహాలు వస్తున్నాయి.