భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలిసి పెట్టుకున్న పొత్తులు కేవలం ఎన్నికలలో విజయం సాధించడానికి ఆ పార్టీ ఓట్ల బదిలీ రూపంలో ఉపయోగపడే మార్గం మాత్రమే కాదు. కమలంతో పొత్తుల వలన అంతకు మించిన ప్రయోజనాలు వారికి ఎన్నో ఉన్నాయి. అన్నింటిని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పి.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యాపిస్తున్న తరుణంలో.. విపక్ష కూటమి స్వేచ్ఛగా ఎన్నికలలో తలపడడానికి.. ప్రజలు తమ సొంత అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడానికి ఈ పొత్తులు పరోక్షంగా దోహదం చేస్తాయి. పైగా ఎన్నికల సమరాంగణంలో మరో రకమైన ఉపయోగం కూడా వారికి ఉంది.
తెలుగుదేశంతో పొత్తుల్లో ఉన్నది కనుక గెలిస్తే అధికారంలో కూడా భాగస్వామ్యం దక్కుతుంది కనుక భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మీద, ఆయన పరిపాలనలో సాగుతున్న సకల అరాచకాల మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి జగన్ సాహసం చేయగల అవకాశం లేదు. జగన్ స్వయంగాను, పార్టీలోని ఆయన కీలక సహచరులతో కలిసి అనేక సిబిఐ కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ఖరారుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్న మోడీ పార్టీని తిట్టడానికి జగన్ కు ధైర్యం చాలకపోవచ్చు.
ఆయన బిజెపి మీద నిప్పులు చెరగకపోతే.. జగన్మోహన్ రెడ్డి బిజెపికి భయపడుతున్నారనే ప్రచారం బాగా జరుగుతుంది. ఆయన ఎన్ని సభలలో మాట్లాడినా తెలుగుదేశాన్ని, జనసేన ను తిట్టవలసిందే తప్ప బిజెపి మీద నిశిత విమర్శలు చేయలేరు. బిజెపి- విపక్షకూటమికి ఒక కవచం లాగా ఉపయోగపడుతుంది. ఈ కవచాన్ని వాడుకొని వారు యుద్ధంలో ఎంత మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
ఇప్పటికే ప్రతి సందర్భంలోనూ కేంద్రం ఎదుట సాగిలపడుతూ.. తనకున్న కేసుల భయంతో వారిని పల్లెత్తు మాట అనలేక, విభజన చట్టం హామీల గురించి గట్టిగా డిమాండ్ కూడా చేయలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఆయన బీజేపీని ఏమీ అనలేక పోతే అది ఆయన దౌర్బల్యం మాత్రమే కాదు, లోపాయికారీతనంగా ప్రజలు పరిగణిస్తారు. ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి చేటుచేస్తుంది.