జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు.. సారా వ్యాపారి’ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా ధైర్యం ఉండాలి. లిక్కర్ వ్యాపారంలో సామాన్యుల, కొమ్ములు తిరిగిన లిక్కర్ వ్యాపారుల, ప్రభుత్వాధినేతల ఊహకు కూడా అందని అరాచక దందాలతో చెలరేగిపోతూ.. నెలతిరిగే సరికి వేల కోట్ల రూపాయల అక్రమార్జనలతో ప్రజల జేబులను కొల్లగొడుతున్న ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గురించి.. ఇంత సూటిగా విమర్శించడం పవన్ కల్యాణ్ కు మాత్రమే చెల్లింది. ఏపీలో సాగుతున్న సారా అరాచక వ్యాపారం, ఇసుక అక్రమ దందాల గురించి పవన్ కల్యాణ్ చిలకలూరిపేట సభలో చాలా పెద్దఎత్తునే ధ్వజమెత్తారు.
ప్రజలు గమనించాల్సిన ఒక కీలకమైన విషయాన్ని పవన్ కల్యాణ్ ఈ సభలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ లావాదేవీలవైపు ప్రజలు మొగ్గుతున్నారు. ప్రభుత్వం కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. చివరకు కిళ్లీ బంకుల్లో ఒక సిగరెట్ కొనుక్కున్నా, కిళ్లీ కొనుక్కున్నా కూడా డిజిటల్ పేమెంట్ చేసి ప్రజలు హాయిగా ఉంటున్నారు. అయతే దేశవ్యాప్తంగా కూడా కేవలం రెండే రెండు వ్యాపారాలకు మాత్రమే.. డిజిటల్ కరెన్సీ వాడకం అనేది అమలులో లేదు.అవేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక వ్యాపారం, సారా వ్యాపారం!
ఈ రెండు వ్యాపారాల్లోనూ ప్రతినెలా వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు జగన్మోహన్ రెడ్డి ఒడిగడుతున్నట్టుగా పవన్ కల్యాణ్ ఈ సభలో ఆరోపించారు. కేవలం అక్రమదందాలు సాగించడం మాత్రమే కాదు. కేంద్రప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ పన్నులను కూడా ఏడాదిలో పదివేల కోట్లకు పైగా జగన్ ఎగవేస్తున్నారని పవన్.. సభలో ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లారు.
ఏపీలో ఇసుక, సారా దందాలు ఎంతగా వివాదాస్పదం అవుతున్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. పైగా ఇవి రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి జీవితాలమీద కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ ఈ దందాల దెబ్బకు అల్లాడిపోతున్నారు. జగన్ బ్రాండ్ లిక్కర్ కంపెనీల మద్యం తాగడం వలన.. ప్రజలు కేవలం తమ డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాదు. వారి ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతోంది. పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తే.. ఈ అరాచక వ్యాపారాలమీద రాబోయే ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
అటు సారా వ్యాపారంలో గానీ, ఇటు ఇసుక వ్యాపారంలో గానీ.. కేవలం నగదు ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తూ ఏరూపంలో జగన్ కోటరీ ప్రజల డబ్బును కాజేస్తున్నదో వివరించి చెప్పడానికి, ఇంకా అనేక ఆధారాలను కూడా విపక్ష కూటమి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ససాక్ష్యంగా జగన్ దందాలను బయటపెట్టడం వలన.. ఆయన పాలన మీద తటస్థంగా ఉండే ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడం సాధ్యమవుతుందని తెదేపా, జనసేన భావిస్తున్నాయి.